హెచ్1 బి వీసా కొత్త ప్రతిపాదన అత్యంత చెత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ 1 బి వీసాల తాజా కఠిన నిబంధనలపై అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) స్పందించింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బి వీసాలకు గడవు పొడిగించక పోవడం, నిబంధనలు కఠినతరం చేస్తుండడం పట్ల భారతీయ ఐటి సంస్థల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిబంధనలపై యుఎస్ఐబిసి నిరసన వ్యక్తం చేసింది. ఇది అమెరికాలోని నిపుణులైన భారతీయ ఉద్యోగుల పాలిట అత్యంత చెత్త పాలసీగా నిలుస్తుందని పేర్కొంది.
అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇక హెచ్1 బి వీసాను పొడిగించుకునే అవకాశం లేకుండా చేయాలన్న ప్రతిపాదన ఐటీ ఉద్యోగులకు ఇది నష్టకరమని వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని దూరం చేయడం సరైంది కాదంది. వారు అమెరికాలో అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్నారని యుఎస్ఐబిసి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం అమెరికన్ వ్యాపారాన్ని, తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చడంతోపాటు దేశానికి హాని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ లక్ష్యాలకు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియన్లపై తీవ్రంగా కన్పిస్తోంది. వేలాది మంది ఇండియన్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండడంతో వేలాది మంది ఇండియన్ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే.