ఆకాశ వీధిలో...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ చుట్టూ ఆకాశ మార్గాల దిశగా (ఎలివేటెడ్ కారిడార్లు) మరో అడుగు పడింది. ఆధునిక హంగులతో మూడు ప్రధాన మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై అధ్యయనానికి ప్రభుత్వం కన్సల్టెన్సీలను నియమించింది. ప్యారెడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు... బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ వరకు... ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ వరకు నిర్మించదలచిన ఆకాశమార్గాలపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదిక అందించాలని కన్సల్టెన్సీలకు ప్రభుత్వం సూచించింది.
ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనాన్ని ఆర్ వీ అసోసియేట్స్ దక్కించుకోగా, ఉప్పల్-ఘట్కేసర్ మార్గాన్ని వాడియా కన్సల్టెన్సీ కైవసం చేసుకుంది. ఐదు కన్సల్టెన్సీలు పోటీ పడగా చివరకు రెండింటికి అవకాశం దక్కినట్టు జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గత అనుభవం, తక్కువ మొత్తంతో అధ్యయనానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం, తదితర అంశాల ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో మార్గంలో అధ్యయనానికి రూ.3 కోట్ల చొప్పున వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
పక్కాగా ప్రణాళికలు...
ప్రస్తుత ప్రతిపాదనల మేరకు మూడువైపులా ఔటర్‌ను అనుసంధానిస్తూ ఎలివేటెడ్ మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్లలో ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరిస్తూనే... ఇరుకు ప్రాంతాల్లో ఆకాశమార్గాలను (ఎలివేటెడ్ కారిడార్లను) నిర్మిస్తారు. ఒక్కో కిలోమీటర్‌కు రూ.వంద కోట్ల వంతున ఖర్చవుతుందని అంచనా. ఉప్పల్- ఘట్కేసర్ మధ్య 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే వచ్చే అవకాశం ఉంది.
ప్యారెడైజ్- శామీర్‌పేట్ మార్గంలో కంటోన్మెంట్ నుంచి తూంకుంట వరకు 12 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ రానుంది. బాలానగర్-నర్సాపూర్ కారిడార్‌లో ఇరుకు రహదారులు పెద్దగా లేకపోవడంతో ఎలివేటెడ్ మార్గం తక్కువగానే ఉంటుంది. వీటిపై సమగ్ర సర్వేతో పాటు డిజైన్ల రూపకల్పన, నిర్మాణ అంచనాలు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, తదితర అంశాలతో కన్సల్టెన్సీలు నివేదిక లను రూపొందిస్తాయి.
రద్దీకి చెక్...
ఎన్‌హెచ్-163లో ఉన్న ఉప్పల్-ఘట్కేసర్ మధ్య వాహనాల రద్దీలో వెళ్లడం నరకప్రాయంగా మారింది. వరంగల్, హన్మకొండల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ఉప్పల్ నల్లచెరువు నుంచి రింగ్‌రోడ్డు వరకు ఇరుకైన రహదారి వల్ల, మెట్రో నిర్మాణ పనుల దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఎలివేటెడ్ మార్గం వస్తే ఘట్కేసర్ ఔటర్ నుంచి నేరుగా ఉప్పల్ రింగు రోడ్డుకు చేరుకోవచ్చు.
ఇక నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారి, నర్సాపూర్ మార్గంలోనూ ఔటర్‌కు అనుసంధానం చేస్తూ ఎలివేటెడ్ హైవేలు నిర్మిస్తే మెదక్, సిద్ధిపేట్, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా నగరంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. అవసరమైన చోట జంక్షన్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా నాలుగు వైపులా రద్దీ లేకుండా (ఫ్రీ ఫ్లో) వాహనాలు సాగిపోతాయి.