గ్రామాలను దత్తత తీసుకోవాలి
డాక్టర్ రామినేని ఫౌండేషన్ను కోరిన ఎంపీ కేశినేని
సాక్షి,విజయవాడ : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే డాక్టర్ రామినేని ఫౌండేషన్ వంటి సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని, వాటిని అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కోరారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ 15వ పురస్కారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ పాఠశాలలు, విద్యార్థులకు రామినేని ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తోందని, గ్రామాలను కూడా అభివృద్ధి చేయాని కోరారు.
కృష్ణాజిల్లా వారు తెలివైన వారంటూ మాజీ ఎమ్మెల్యే వయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలకు కేశినేని స్పందిస్తూ ఇక్కడి యువతులను పెళ్లి చేసుకుని రాయలసీమ ప్రజలు కూడా తెలివి నేర్చుకుని రాజ్యాలు ఏలుతున్నారంటూ చతురోక్తి విసిరారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సంప్రదాయాలు దెబ్బతినకుండా చూడాలని డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి కృషి చేశారని, అందుకే ఆయన కుమారులకు ధర్మప్రచారక్ , సత్యవాది, హరిశ్చంద్రుడు వంటి పేర్లు పెట్టారని కొనియాడారు.
తండ్రి ఆశయాలను ఆయన కుమారులు కొనసాగించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను సత్కరించడం ఫౌండేషన్ గొప్పదనమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీసీఎన్బీ డెరైక్టర్ డాక్టర్ సిహెచ్.మోహనరావుకు విశిష్ట పురస్కరం కింద లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, శాలువాలతో సత్కరించారు.
సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నంనాయుడు, సినీనటుడు రాళ్లపల్లికి విశేష పురస్కారాల కింద నగదు, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. అనంతరం డాక్టర్ పొత్తూరి మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయాలతో ఈ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు. అయ్యన్న చౌదరి తన కుమారులకు పెట్టిన పేర్లే ఆయనకు మన సంస్కృతిపై ఉన్న ప్రేమను తెలుపుతోందన్నారు.
గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఫౌండేషన్ సేవలను వివరించారు. ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణానంద స్వామీజీ రూపొందించిన భగవద్గీత యూఎస్బీని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ప్రారంభంలో మాధవపెద్ది మూర్తి బృందం సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించింది.