హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ : రూ. 47,250
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ అంతా కొత్తదైన స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఐ3ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్ ధర రూ.47,250(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అనిల్ దువా పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించామని, 100 సీసీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెస్తున్నామని పేర్కొన్నారు.
ఇతర మోడళ్లలోనూ ఐ3ఎస్ టెక్నాలజీ
ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌గా వ్యవహరించే ఐ3ఎస్ టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్‌లో బండి ఆగగానే ఇంజిన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుందని, క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుందని అనిల్ దువా పేర్కొన్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులున్న నగరాల్లో కూడా మంచి మైలేజీ (70 కిమీ మైలేజీ వస్తుందని అంచనా)వస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, ఇతర బైక్‌ల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని వివరించారు. 100-సీసీ ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో సూపర్ స్ప్లెండర్‌లో ఉన్న త్రీ-టోన్ పెయింట్ ఆప్షన్, అల్యూమినియంతో కూడిన ఫుట్-పెగ్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ డౌన్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. చాలా వరకూ స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జీని పోలిన ఈ బైక్ నాలుగు కొత్త రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు.
ఈ కంపెనీ గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. వీటిల్లో 620 సీసీ హస్టర్, 250సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్ఎక్స్ 250ఆర్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 150 సీసీ స్కూటర్ జిర్‌లో రెండు మోడళ్లు, 125 సీసీ డేర్, 110 సీసీ స్కూటర్ డాష్‌లను కూడా ఈ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేసింది. ఇక ఈ నెలలోనే ప్లెజర్, ఎక్స్ట్రీమ్, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని అనిల్ దువా వెల్లడించారు.