SPN
-
ఇదేం న్యాయం?
న్యూఢిల్లీ: భారత్‌లో నిర్వహించే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో బిడ్లు దాఖలు చేసిన రెండు కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన చెల్లింపులపై చివరి నిమిషంలో బీసీసీఐ మార్పులు చేయడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఏప్రిల్ 3న బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా... పోటీపడ్డ స్టార్ ఇండియా, ఎస్పీఎన్ (సోనీ కార్పోరేషన్)లు ఈ అంశంపై బీసీసీఐకి లేఖ రాశాయి. ప్రసార హక్కులు పొందిన సంస్థ... సొంత గడ్డపై నిర్వహించే అన్ని మ్యాచ్‌లకు ఒకే మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమని అందులో పేర్కొన్నాయి. టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ముక్కోణపు టోర్నీల వంటి సిరీస్‌లలో భారత్ పాల్గొనే మ్యాచ్‌కు, పాల్గొనని మ్యాచ్‌కు ఒకే మొత్తం చెల్లించాల్సి రావడం ఇబ్బందికరం అని స్పష్టం చేశాయి. భారత్ బరిలో ఉంటే చూసే ప్రేక్షకుల సంఖ్యకు, లేకుంటే చూసేవారికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇది సబబు కాదని... తక్షణమే దాన్ని సవరించాలని కోరాయి. -
పదేళ్లకు 16 వేల కోట్లు!
ఐపీఎల్ ప్రసారహక్కులకు భారీ మొత్తం ఆశిస్తున్న బీసీసీఐ ముంబై: ఐపీఎల్ తొలి సీజన్‌నుంచి రాబోయే ఐపీఎల్-10 వరకు మ్యాచ్‌ల ప్రసారహక్కుల కోసం సోనీ సంస్థ బీసీసీఐకి చెల్లించిన మొత్తం దాదాపు రూ. 8200 కోట్లు. ఇప్పుడు ఆ తర్వాత పదేళ్లకు భారత క్రికెట్ బోర్డు దీనికి దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఆశిస్తోంది. మరో పదేళ్ల పొడిగింపు ఇవ్వాలంటే సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్) రూ. 16 వేల కోట్లను బ్రాడ్‌కాస్టింగ్ ఫీజుగా చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2015 ఐపీఎల్లో స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల ద్వారా సోనీకి వచ్చింది రూ. 1000 కోట్లు మాత్రమే. 2016లో ఇది మరి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. అదే బీసీసీఐ చెబుతున్నట్లుగా ఇప్పుడు ఏడాదికి రూ. 1600 కోట్లు చెల్లించడం మాత్రం సాధ్యమయ్యే వ్యవహారం కాదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ‘ఐపీఎల్‌కు పాపులార్టీ ఉన్న మాట వాస్తవమే. కానీ మరీ ఈ స్థాయిలో పెంచడం మంచిది కాదు. బంగారు బాతును బోర్డు చంపుకున్నట్లే అవుతుంది’ అని వారు అభిప్రాయ పడ్డారు. ఐపీఎల్ హక్కుల కోసం స్టార్ గ్రూప్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తుండటంతో ఇద్దరి మధ్య పోటీనుంచి ఎక్కువగా లాభం పొందేందుకే బీసీసీఐ ఇలా బెట్టు చేస్తున్నట్లు మరో సమాచారం. అయితే చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, చివరకు ఎంత మొత్తం వద్ద ఆగుతుందనేది చెప్పలేనని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.