ఐపీఎల్ ప్రసారహక్కులకు భారీ మొత్తం ఆశిస్తున్న బీసీసీఐ
ముంబై: ఐపీఎల్ తొలి సీజన్‌నుంచి రాబోయే ఐపీఎల్-10 వరకు మ్యాచ్‌ల ప్రసారహక్కుల కోసం సోనీ సంస్థ బీసీసీఐకి చెల్లించిన మొత్తం దాదాపు రూ. 8200 కోట్లు. ఇప్పుడు ఆ తర్వాత పదేళ్లకు భారత క్రికెట్ బోర్డు దీనికి దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఆశిస్తోంది. మరో పదేళ్ల పొడిగింపు ఇవ్వాలంటే సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్‌పీఎన్) రూ. 16 వేల కోట్లను బ్రాడ్‌కాస్టింగ్ ఫీజుగా చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2015 ఐపీఎల్‌లో స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల ద్వారా సోనీకి వచ్చింది రూ. 1000 కోట్లు మాత్రమే. 2016లో ఇది మరి కాస్త ఎక్కువగా ఉండవచ్చు.
అదే బీసీసీఐ చెబుతున్నట్లుగా ఇప్పుడు ఏడాదికి రూ. 1600 కోట్లు చెల్లించడం మాత్రం సాధ్యమయ్యే వ్యవహారం కాదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ‘ఐపీఎల్‌కు పాపులార్టీ ఉన్న మాట వాస్తవమే. కానీ మరీ ఈ స్థాయిలో పెంచడం మంచిది కాదు. బంగారు బాతును బోర్డు చంపుకున్నట్లే అవుతుంది’ అని వారు అభిప్రాయ పడ్డారు. ఐపీఎల్ హక్కుల కోసం స్టార్ గ్రూప్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తుండటంతో ఇద్దరి మధ్య పోటీనుంచి ఎక్కువగా లాభం పొందేందుకే బీసీసీఐ ఇలా బెట్టు చేస్తున్నట్లు మరో సమాచారం. అయితే చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, చివరకు ఎంత మొత్తం వద్ద ఆగుతుందనేది చెప్పలేనని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
పదేళ్లకు 16 వేల కోట్లు!
Published Sat, Jun 18 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement