గీత... సనాతన సత్యం
గీతాశాస్త్రంలో ఉపదేశించిన విషయాలు కొత్తగా కల్పించబడినవి కావు. అవి సనాతనమైనవి. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ (4-1)వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్. ‘‘అర్జునా! ఇది సనాతన విద్య. ఈ యోగవిద్యను నేనింతకు ముందు వివస్వతునికి ఉపదేశించాను. వివస్వతుడు దానిని తన కుమారుడైన వైవస్వత మనువుకు ఉపదేశించాడు. వైవస్వతుడు ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించాడు. ఇట్లా పరంపరగా ఉపదేశించిన ఈ విద్య రాజర్షులకు తెలుస్తుంది. కాని చాలా కాలమైనందువల్ల ఈ విద్య మరుగున పడింది. నీవు నా భక్తుడివైనందువల్ల నీకు ఈ రహస్యాన్ని ఉపదేశిస్తున్నాను. స ఏవాయం మయా తే ద్య యోగః ప్రోక్తః పురాతనః (4-3) భక్తో సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్.
‘‘నీవు నాకు ప్రియమిత్రుడవైనందువల్ల నీ యెడల నాకు ప్రీతి కలిగింది. అందువల్ల నీ క్షేమాన్ని కోరి రహస్యమైన ఈ పరవిద్యను నీకు బోధిస్తున్నాను. శ్రద్ధతో విను’’ ఈ గ్రంథంలోని సూచనలను అనుసరించి భవబంధ విముక్తులైనవారు అనేకమంది ఉన్నారు.
ఈ శాస్త్రాన్ని అనుసరించి పూర్వం ఎందరో ముముక్షువులు కర్మలు చేసి సంసిద్ధి పొంది ఉన్నారు. వారిలా ఇతరులు కూడా ఈ శాస్త్రాన్ని అనుసరించిన యెడల కృతకృత్యులు కావచ్చు. శ్రీ భగవాన్ ఉవాచ రుషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్బ్రహ్మసూత్రపదైవేశ్చైవ హేతుమధ్విర్వినిశ్చితైః (1304) ‘‘అర్జునా! ఈ విషయాలు మహర్షులచే పేదాలచే బహువిధాలుగా వివరింపబడి సిద్ధాతీకరింపబడి ఉన్నాయి. అంతేకాదు, ఈ సత్యాలు హేతువాదములచేత నిస్సందేహంగా నిర్ణయింపబడి బ్రహ్మసూత్రాలచేత నిశ్చయింపబడి ఉన్నాయి. ఇవి సనాతన సత్యాలు’’
ఉత్తమమైనది, పవిత్రమైనది, విద్యలలో శ్రే ష్ఠమైనది, పరమ రహస్యమైనదీ అయిన ఈ విద్య సుబోధకమైనది, అభ్యసించడానికి సులభమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. కిటుకు తెలిస్తే అంతా సులభమే కావచ్చు కానీ దానిని తెలుసుకోవడం అంత సులువు కాదు. దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి. కూర్పు: బాలు- శ్రీని (వచ్చేవారం: ప్రయత్నం వ్యర్థం కాదు)
మామిడిపూడి ‘గీత’