కథలు తిందాం
పుట్టిన రోజు పేరు చెప్పగానే నోరూరించే కేక్ పిల్లల కళ్ల ముందు కదలాడుతుంది.ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా..? ఇష్టమైన కేక్ ఎప్పుడు ముందుకొస్తుందా..? అని ఎదురు చూస్తుంటారు. బర్త్ డే పార్టీకి వచ్చే పిల్లలందరి దృష్టి దాని మీదే. కేక్ ఇలా కట్ చేయగానే అలా చిన్నారుల నోళ్లలో కరిగిపోతుంది.
అసలు కేక్ లేనిదే బర్త్ డే పార్టీ లేదు. వీటికే కాస్త సృజనాత్మకత జోడించి కేక్‌లతో కథలు చెప్పిస్తున్నారు కేక్ డిజైనర్ ప్రగతి. ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ పేరుతో ఆమె తయారు చేస్తున్న విభిన్న తరహా కే క్లు పిల్లలు, పెద్దల మనసు దోచేస్తున్నాయి.
కథలు తిందాం
రెగ్యులర్ కేక్‌లకు కాలం చెల్లింది. రకరకాల ఫ్లేవర్స్‌తో లభించే టేస్టీ టేస్టీ కేక్‌లంటే పిల్లలకు ప్రాణం. వీటికి డిఫరెంట్ మేకప్‌తో పాటు.. ఓ థీమ్‌ను డిజైన్ చేయడం ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ ప్రత్యేకత. కొత్తదనంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఓ వనిత సృజనకు ప్రతిరూపమే స్టోరీ కేక్. సింగపూర్‌లో చూసిన కస్టమైజ్డ్ కేక్స్‌ను స్ఫూర్తిగా పొందిన ప్రగతి.. ఈ కేక్‌లకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ‘నేను సింగపూర్‌లో డిగ్రీ చేస్తుండగా.. అక్కడ ఇలాంటి కేక్‌లు చూశాను. ఇండియాకు వచ్చాక కొత్తదనంతో నా ప్రత్యేకత తెలియజేద్దామనుకున్నా. కొన్ని కేక్ శాంపిల్స్ తయారు చేసి స్నేహితులకు పంపాను. వారికి ఆ థీమ్ నచ్చడంతో.. 2012లో
జూబ్లీహిల్స్‌లో ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టాను’ అని చెప్పారు ప్రగతి.
చాయిస్ కస్టమర్స్దే
కేక్‌పై డిజైన్ చేయాల్సిన స్టోరీ చాయిస్ కస్టమర్స్దే. బర్త్ డే బాయ్స్ చెప్పే కథలను బట్టి ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ తయారవుతుంది. మొక్కలంటే ఇష్టమున్న పిల్లలకు.. బోన్సాయ్ చెట్టు నుంచి హోమ్ గార్డెన్ వరకు అన్నీ కొలువుదీర్చి కేక్నే ఓ గ్రీన్ సీనరీగా మార్చేస్తుంది ప్రగతి. పిల్లలు చెప్పే కథలే థీమ్‌గా కేక్‌లను తయారు చేస్తుంది. ముందు ఆ స్టోరీస్‌ను పేపర్‌పై గీసి, దాన్ని పిల్లలకు చూపించి నచ్చితేనే కేక్ తయారీ మొదలుపెడుతుంది. పిల్లలకే కాదు పెద్దల బర్త్‌డేలకు కేక్స్ డిజైన్ చేయడంలో ప్రగతి పర్ఫెక్టే. ఓ 60 ఏళ్ల పెద్దాయన పుట్టిన రోజుకు కేక్ డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది. గతంలో ఆయన మేస్త్రీ పని చేశారు. దానికి తగ్గట్టుగా కేక్ డిజైన్ చేసింది. గతేడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వార్షికోత్సవాలకు.. అకాడమీ బొమ్మ, మధ్యలో పోలీస్ సిబ్బంది నిలబడ్డట్టు కేక్ ప్రిపేర్ చేసింది. పుట్టిన రోజులకే కాదు వెడ్డింగ్ యానివర్సరీకి, కాలేజీ ఫ్రెషర్స్, ఫేర్వెల్ పార్టీస్‌కు తగ్గట్టుగా తయారు చేసే కేక్‌లకు బోలెడంత డిమాండ్ ఉంది. పెళ్లి శుభలేఖతో పంపించే కప్ కేక్ బంధువులకు, స్నేహితులకు మరింత అనుబంధాన్ని పంచుతోంది. వేడుకకు తగ్గట్టుగా డిజైన్ చేస్తుండటంతో ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సక్సెస్ ‘స్టోరీ’
మా అమ్మ సునీత డాక్టర్, నాన్న ప్రకాష్ వ్యాపారవేత్త. నేను మొదట కంపెనీ పెట్టినప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తే సక్సెస్ వస్తుందని వాళ్లు ప్రోత్సహించారు. ఎన్ని ఆర్డర్లు వచ్చినా స్వయంగా నేనే అన్ని పనులూ చేసుకుంటాను. కేక్‌లపై డిజైన్‌గా మారిన కథలే నా బిజినెస్ సక్సెస్‌కు కారణం.