కాంగ్రెస్‌కు మరో షాక్
►ఉప ఎన్నికల సమయంలో..
►పార్టీని వీడుతున్న నేతలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూత్ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు వి.ఆదర్శ్‌రెడ్డి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం సంగారెడ్డిలో ప్రకటించారు. ఓ వైపు మెదక్ ఎంపీ పదవి కోసం ఉప ఎన్నిక సమీపిస్తుండటం... అభ్యర్థిని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్న అధిష్టానానికి ఆదర్శ్‌రెడ్డి షాక్ ఇచ్చారు. పటాన్చెరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశ్విన్‌గౌడ్ ఇప్పటికే రాజీనామా చేశారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో రెండింటి మాత్రమే గెలిచి గుడ్డిలో మెల్ల అన్నా చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి.
ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడమే కాకుండా టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. గత 3 నెలలుగా డీసీసీ అధ్యక్షుడు లేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు లేకపోయారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర నేతలు హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు డీసీసీ అధ్యక్షుడి నియామకంపై చర్చించారు.
ఎట్టకేలకు ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని జాతీయ నేతలకు సిఫార్సు చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు జిల్లాలో గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.