సమ్మె సక్సెస్
కరీంనగర్: జిల్లాలో సార్వత్రిక సమ్మె సక్సెస్ అయింది. బీజేపీ అనుబంధ సంస్థ కార్మిక సంఘం బీఎంఎస్ మినహా టీడీపీ, టీఆర్ఎస్, అనుబంధ సంఘాలతో పాటు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐసీటీయూ, టీయూసీసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్, యూటీయూసీ, ఎల్పీఎఫ్, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ ట్రేడ్ యూనియన్లు, వివిధ రాజకీయ పార్టీలు, బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లాలోని 11 డిపోలకు చెందిన 910 ఆర్టీసీ బస్సులు కదలేదు. కార్మికులు సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.కోటి నష్టం వాటిల్లింది. బ్యాంకులు, ఎల్ఐసీ, తపాలా కార్యాలయాలు మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. రామగుండం రీజియన్‌లో 9 భూగర్భగనులతో పాటు నాలుగు ఓపెన్ కాస్టుల్లో 15 వేల మంది కార్మికులు, 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలతోపాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. వివిధ ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.