మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
మైనర్ బాలిక కిడ్నాప్ అనంతరం అత్యాచారం జరిపిన నిందితుడు సులేమన్ బిన్ హస్సన్ను నిన్న అరెస్ట్ చేసినట్లు శాలిబండ పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్.మహేశ్వర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. కిడ్నాప్, అత్యాచారం తదితర కేసులు అతడిపై నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పోలీసుల కథనం మేరకు ఈ నెల 15వ తేదీన మైనర్ బాలిక కిడ్నాప్ అయింది. నగరంలోని పాత బస్తీలోని లాడ్జీలో ఆ బాలికపై సులేమన్ అత్యాచారం చేశాడు.
అనంతరం ఆమెను కర్ణాటకలోని గుల్బర్గకు తరలించాలని అనుకున్నాడు. అయితే ఆ బాలిక మాయమైందని తమకు ఫిర్యాదు అందిందని, ఆ మేరకు తాము దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి మహేశ్వర్ తెలిపారు. ఆ బాలికను ఇంటి సమీపంలో ఆడుకోవడం చూశామని చెప్పారు. అనంతరం ఆ బాలికను ఆమె తల్లితండ్రులకు అప్పగించామన్నారు.
మైనర్ బాలిక, ఆమె తండ్రి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అందులోభాగంగా అతడిని శాలిబండ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.