రెండు సినిమాలకు పచ్చజెండా
అందాలరాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా తన ‘తడాఖా’ ఏంటో చూపించారు సునీల్. ప్రస్తుతం ఆయన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దసరాబుల్లోడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపేశారు సునీల్. అందులో మొదటిది భీమినేని శ్రీనివాసరావు సినిమా. ‘సుడిగాడు’ లాంటి భారీ విజయం తర్వాత సునీల్‌తో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేశారు భీమినేని.
రీమేక్‌ల స్పెషలిస్ట్ అయిన భీమినేని... సునీల్‌తో తెరకెక్కించే సినిమా కూడా రీమేకే కావడం విశేషం. తమిళ హిట్ ‘సుందరపాండ్యన్’ చిత్రాన్ని సునీల్ కథానాయకునిగా రీమేక్ చేయబోతున్నారాయన. ఇక రెండో సినిమా విషయానికొస్తే... ఈ సినిమా ద్వారా రచయిత గోపిమోహన్ దర్శకునిగా పరిచయం కానున్నారు. మళ్ల విజయప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌కి వెళ్లనుంది.