లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు!
ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆడం జాన్సన్ ఓ 15 ఏళ్ల బాలిక పట్ల లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు కోర్టు ముందు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు నమోదుచేసిన రెండు అభియోగాలను ఒప్పుకొన్నాడు. అయితే తీవ్రమైన లైంగిక దుశ్చర్యలకు పాల్పడినట్టు పోలీసులు మోపిన మరో రెండు అభియోగాలను మాత్రం అతడు తిరస్కరించాడు. లైంగిక ఉద్దేశంతో ఓ పాఠశాల బాలికతో సన్నిహితంగా వ్యవహరించడం, ఆమెను ముద్దాడటం వంటి చర్యలకు పాల్పడ్డానని అతను బుధవారం బ్రాడ్ఫర్డ్ క్రోన్ కోర్టు ముందు అంగీకరించాడు. ఈ నేరాన్ని అంగీకరించే సమయంలో అతని ప్రియురాలు స్టాసీ ఫ్లౌండర్స్ (26)లో కోర్టులోనే ఉంది.
పాఠశాల బాలికలతో లైంగికంగా దుశ్చర్యలకు పాల్పడాడ్డన్న ఆరోపణలపై గత ఏడాది మార్చిలో ఆడం జాన్సన్ అరెస్టయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ స్టాసీ గర్భవతిగా ఉన్న సమయంలో జాన్సన్ ఓ టీనేజ్ బాలికపై లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నోసార్లు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు, ప్రీమియర్ లీగ్‌లో సుందర్‌ల్యాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్‌కు ప్రస్తుతం తొమ్మిది నెలల బిడ్డ ఉంది.