అందరూ సేవాభావం అలవరుచుకోవాలి
యూనివర్సిటీక్యాంపస్ : అందరూ సేవాభావం అలవరుచుకోవాలని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లా యంత్రాంగం తరఫున ఆయనకు స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం రవిశంకర్ సత్సంగం చేశారు. అందరూ ఆ«ధ్యాత్మికత, సేవాభావం అలవాటు చేసుకోవాలని అప్పుడే సంతోషంగా ఉం టారని చెప్పారు. ప్రతి మనిషిలోపల ఏడు చక్రాలు ఉంటాయన్నారు. ఏడుకొండలపై వెలసిన శ్రీవారు ఎంతో మహిమకలిగిన దేవుడు అన్నారు. అన్నమయ్య రచించిన ‘‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’’ కీర్తనలోని పరామార్థాన్ని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్, తిరుపతి సాంస్కృతిక హబ్‌గా తయారవుతుందన్నారు. ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాకు కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్న నేతృత్వంలో తిరుపతి ఆధ్యాత్మిక ఆనంద నగరంగా తీర్చిదిద్దబడుతుందనడంలో సందేహం లేదన్నారు.
అలరించిన అన్నమాచార్య కీర్తనలు
ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా ఎస్వీ స్టేడియంలో జోతిర్మయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. ప్రేక్షకులు భక్తిసాగరంలో మునిగి తేలారు. అనంతరం హాలీంఖాన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న, ఆర్డీఓ కనకనరసారెడ్డి పర్యవేక్షించారు.
నేటితో ముగియనున్న ఉత్సవాలు
ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి ఎస్వీ స్టేడియంలో శ్రీరామనవమి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే సినీనేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవీ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విబ్రీమీడియా పర్యవేక్షిస్తోంది.
యోగాతో మానసిక శాంతి
తిరుచానూరు: యోగాతోనే మానసిక శాంతి సాధ్యమని యోగా శిక్షకులు తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం శిల్పారామంలో యోగాపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు యోగాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు తరలివచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ ఒకప్పుడు జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానికి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు.