ఎస్వీయూ క్యాంపస్‌లో రగడ
రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ
యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం కొట్టుకొనే స్థాయికి చేరింది. విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ప్రిన్సిపాల్ చాంబర్ ధ్వంసమైంది. పోలీసులు సరైన సమయంలో స్పందించక పోవడంతో గొడవ ముదిరింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. సుమారు 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కళాశాలలో ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు, అనుబంధ వసతి గృహానికి అధికారులు సెలవు ప్రకటించారు. సోమవారం రాత్రికల్లా వసతి గృహాలు ఖాళీ చేయాలని సర్క్యులర్ ఇచ్చారు. ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో బీటెక్ రెగ్యులర్, బీటెక్, ఎంటెక్ డ్యూయెల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతున్న సందర్భంలో రెండు కోర్సుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. అది చివరికి ప్రిన్సిపల్ చాంబర్ ధ్వంసానికి దారితీసింది.
సంఘటన బాధాకరం: కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమమని, ఘటన బాధాకరమని కళాశాల ప్రిన్సిపాల్ పద్మనాభం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కళాశాల ప్రిన్సిపాల్‌గా పద్మనాభం బాధ్యతలు చేపట్టిన రోజే ఈ సంఘటన జరగడం ఆయన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.