చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది.
తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక
యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది.
తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు.
ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది.
దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కింకర్తవ్యం ఏమిటి?
►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి
►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి.
►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి.
►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి.
►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.
►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి.
►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి.
రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది
చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు.
సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు
నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది.
–చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి
తక్షణ కార్యాచరణ అవసరం
చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి.
– చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త
ఇదే చివరి తరం అనుకుంటున్న
చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి.
– గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట
పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు
తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు.
– తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట
పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది
ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి.
–సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి
నావంతుగా..
నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది.
– పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి