స్మగ్లర్ల వాహనాలకు తుప్పు
– సకాలంలో జరగని ఆన్లైన్ వేలం
– జాప్యం జరిగేకొద్దీ పడిపోతున్న ధర
– వేలం వేయాల్సిన వాహనాల విలువ 10 కోట్లకు పైనే
– 200 కి పైగా వాహనాలు తూకానికి వేయాల్సిందే
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్ల వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వందలాది వాహనాలు ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పటికే 200 వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వీటిని సకాలంలో వేలం వేసి అధిక మొత్తంలో ఆదాయాన్ని దక్కించుకునే విషయంలో అటవీ, ఆర్టీఏ శాఖలు నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. దీంతో కోట్ల విలువ చేసే వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. గడచిన మూడేళ్లుగా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఎంతో మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. వీటిలో కార్లు, లారీలు, వ్యాన్లు, జీపులు, టాటా సుమోలు, టవేరాల వాహనాలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణాల్లో మూలుగుతున్నాయి. తిరుపతికి దగ్గరలోని భాకరాపేట దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో మరో 450 వాహనాలున్నాయి. ఇవి మాత్రమే కాకుండా తిరుపతి డీఎఫ్వో కార్యాలయ ప్రాంగణంలోనూ అడుగు ఖాళీ లేకుండా సీజ్డ్ వాహనాలను పెట్టారు. ఇవన్నీ రెండేళ్లుగా ఇక్కడే మూలుగుతున్నాయి. వీటిని నెలల తరబడి ఇలాగే ఉంచడం వల్ల టైర్లు, ఇతర స్పేర్లు మాయమవుతున్నాయి. సకాలంలో వీటిని వేలం వేయలేక అటవీ శాఖ అవస్థలు పడుతోంది...
వేలం ప్రక్రియ జరగాలంటే...
పట్టుకున్న వాహనాలను వేలం వేయడం అంత తేలికైన విషయం కాదనీ, నిబంధనల ప్రకారం ఇందుకోసం కనీసం ఆరు నెలలు వేచి ఉండాల్సిందేనని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి మొదట ఓనర్షిప్ వివరాలను అటవీ శాఖ తీసుకుంటుంది. ఇందుకోసం రవాణా శాఖకు లెటర్ రాయాలి. వాహనాల నెంబర్ల ప్రకారం ఓనర్షిప్ వివరాలు తెలిశాక, ఆయా ఓనర్లకు నోటీస్లు జారీ చేస్తారు. ఓనర్ల నుంచి సమాధానం రాకపోతే పేపర్ ప్రకటన జారీ చేస్తారు. అప్పటికీ వాహనాల యజమానుల నుంచి స్పందన లేకుంటే, 1967 ఫారెస్ట్ యాక్టు సెక్షన్ 44 ప్రకారం వాహనాలను అటవీ శాఖ ప్రభుత్వం పరం చేసుకుంటున్నట్లు కాన్ఫికేషన్ ఆర్డర్లు జారీ చేసి మరోసారి వాహనాల విలువను నిర్ధారించమని రవాణా శాఖ అధికారులను కోరతారు.
ఈ విధంగా వాహనాల విలువ «నిర్ణయించాక అన్లైన్ పద్దతిలో వేలం నిర్వహించి ఎక్కువ కోట్ చేసిన వారికి వాహనాలను అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి కనీసం ఆరు నుంచి ఏడాది కాలం పడుతుందనీ, ఒక్కోసారి రవాణా శాఖ నుంచి వివరాలు వెంటనే అందకపోతే మరింత ఆలస్యం జరుగుతుందని అటవీ శాఖ చెబుతోంది.
ఇప్పటి వరకూ 1000 వాహనాలే వేలం...
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 1000 పైగా వాహనాలను అటవీ శాఖ వేలం వేసింది. వారం రోజుల కిందటనే తిరుపతి అటవీ శాఖ అధికారులు 161 వాహనాలను వేలం వేశారు. వీటి ద్వారా రూ.1.20 కోట్ల ఆదాయం లభించింది. ప్రొద్దుటూరు, రాజంపేట, కడప డివిజన్లలోనూ వాహనాల వేలం జరగాల్సి ఉంది. వీటిని వేలం వేయడం ద్వారా రూ.10 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. వీటన్నింటినీ మార్చిలోగా వేలం వేస్తామని తిరుపతి డీఎఫ్వో సుబ్బారెడ్డి తెలిపారు.