టీచర్లకు ఆప్షన్లు లేవ్!
ఉపాధ్యాయ సంఘాలకు కమల్నాథన్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకూ ఆప్షన్ సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమల్నాథన్ తోసిపుచ్చారు. టీచర్లు రాష్ట్రస్థాయి క్యాడర్ కిందకు రారు కాబట్టి చట్ట ప్రకారం ఆప్షన్ సౌకర్యం ఉండదని ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు కమిటీని ఏం కోరాయంటే...
సొంత రాష్ట్రాలకు పంపాలి: పీఆర్టీయూ
ఓపెన్ కోటాలో వచ్చిన టీచర్లకు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం కల్పించాలి. 2000 డీఎస్సీ కంటే ముందు 30 శాతం, తర్వాత 20 శాతం ఓపెన్ కోటా అమల్లో ఉంది. ఫలితంగా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో నాన్ లోకల్ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. స్థానికతను గుర్తించి వారి సొంత జిల్లాలకు పంపించాలి.
దంపతులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటే.. వారికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలి.
ఉమ్మడి నిబంధన అమలు చేయాలి: ఎస్టీయూ
కాగా రాష్ట్రంలో 7 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 93 శాతం మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఉన్నారని, అందరికీ ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని ఎస్టీయూ కోరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని, కొత్త రాష్ట్రాల్లోనూ టీచర్ల సమస్యలు కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ కోరింది.