గురునాథ్‌పై చార్జిషీట్
ముంబై: బీసీసీఐ అధ్యక్ష పదవిని పొడిగించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎన్ .శ్రీనివాసన్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీఎల్-6 సీజన్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కామ్‌పై శనివారం స్థానిక అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉదయ్ పద్వాద్కు పోలీసులు ఈ చార్జిషీట్‌ను సమర్పించారు.
ఇందులో గురునాథ్‌తో పాటు అతడి స్నేహితుడు విందూ దారాసింగ్ మరో 20 మంది పేర్లను కూడా చేర్చారు. వీరిలో మెయ్యప్పన్, విందూ పేర్లను స్పాట్ ఫిక్సింగ్ కింద కాకుండా కేవలం బెట్టింగ్ పైనే చేర్చినట్టు సమాచారం. అలాగే పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్, అదే దేశానికి చెందిన 15 మంది బుకీలను ‘ఆచూకీ తెలియని నిందుతులు’గా పేర్కొన్నారు. మొత్తం 11,500 పేజీలతో కూడిన ఈ చార్జిషీట్లో 200 సాక్షుల పేర్లతో పాటుగా ఆరు ఫోరెన్సిక్ నివేదికలు, 181 సీజ్ చేసిన వస్తువులను, ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజి, సిమ్ కార్డు వివరాలు, ఇతర సాక్ష్యాలను పొందుపరిచారు. ముంబై ఖిల్లా కోర్టు నవంబర్ 21న ఈ కేసులో వాదనలు విననుంది.
‘కీలక ఆధారాలున్నాయి’
ఈ చార్జిషీట్లో గురునాథ్‌పై ఐపీసీ సెక్షన్ 465, 466, 468, 471, 490, 420, 212, 120బీ, 34 కింద కేసులు నమోదు చేశారు. ‘తమ జట్టు వ్యూహాల గురించి, జట్టు కూర్పు గురించి, ఆటగాళ్ల గాయాల గురించి, ఏ స్థానంలో ఏ ఆటగాడు బ్యాటింగ్ చేయబోతున్నాడనే కీలక విషయాలను గురునాథ్ బయటికి చేరవేసినట్టు మా దగ్గర కీలక ఆధారాలున్నాయి. మొదట గురునాథ్ వీటిని విందూ సింగ్‌కు చెప్పేవాడు. అక్కడి నుంచి బుకీలు పవన్ జైపూర్, సంజయ్ జైపూర్, జూపిటర్లకు తెలిసేవి. వీరు మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసేవారు’ అని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.