విభజనపై సమాచారం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌ను అడిగి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ వివరాలను శుక్రవారం అసెంబ్లీ, మండలిలో సభ్యులకు పంపిణీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఏ జిల్లా ట్రెజరీ నుంచి ఎంత ఆదాయం వస్తోంది? ఏ జిల్లా ట్రెజరీ నుంచి ఎంత వ్యయం చేస్తున్నారు? ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్యతో పాటు గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల సమాచారాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది.
బిల్లులోని షెడ్యూల్స్‌లో పేర్కొనని సమాచారాన్ని కూడా శాఖల వారీగా రెడీ చేసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలోని బి బ్లాక్‌లో ఫొటోకాపీ(జిరాక్స్)లను తీశారు. మండలి, శాసనసభల్లోని అందరు సభ్యులకు అందజేయడానికి వీలుగా 400 ప్రతులను తయారు చేశారు. ఈ సమాచారం ఆధారంగా సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు విభజన బిల్లుకు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.