temper movie
-
Maha Shivaratri 2023: థియేటర్స్‌లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్‌కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్‌లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూపించడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని దేవి థియేటర్స్‌లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్‌లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్‌బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్‌లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
పైలట్ శిక్షణలో ‘టెంపర్’ నటి
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'టెంపర్' చిత్రంలో అపూర్వ శ్రీనివాసన్ నటించింది. టెంపర్ సినిమాలో అపూర్వ శ్రీనివాసన్ పాత్ర ఎంత కీలకమొ మనందరికి తెలిసిందే. టెంపర్ తర్వాత జ్యోతిలక్ష్మి తదితర తెలుగు చిత్రాల్లో నటించిన, మంచి బ్రేక్ రాలేదు. కాగా ప్రస్తుతం సినిమాలు, మోడలింగ్ లో కొనసాగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టైమ్ వేస్ట్ చేయకుండా తనకు ఆసక్తి ఉన్న పైలట్ ట్రైనింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. దుండిగల్ ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ లో హైదరాబాద్ నగర గగనతలంపై అపూర్వ శ్రీనివాసన్ సోలో రైడ్ లో పాల్గొని అందరిని ఆశ్యర్యపరిచింది. -
‘టెంపర్’ రీమేక్.. తెలుగు డబ్బింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. తరువాత ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. తమిళ్లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపుగా తెలుగు సినిమాను మక్కీ కి మక్కీ దించేసినా క్లైమాక్స్‌ను మాత్రం పూర్తిగా మార్చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయోగ్య అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. దీంతో ఇప్పుడు అయోగ్యను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సినిమాను తిరిగి తెలుగులో డబ్ చేస్తే ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. నిర్మాత మాల్కాపురం శివ కుమార్ అయోగ్య డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. -
ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కాపీనా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. ఎన్టీఆర్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. టెంపర్ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన పార్తీబన్, టెంపర్ తన సినిమాకు కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో తాను తెరకెక్కించిన ఉల్లే వెలియే సినిమా ఆధారంగానే టెంపర్ కథను తయారు చేసుకున్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం తాను కాపీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు పార్తీబన్. పూరి దర్శకత్వంలో రూపొందించిన టెంపర్ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై వంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి. తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత పార్తీబన్ -
విశాల్‌కు షాక్.. చివరి నిమిషంలో ‘అయోగ్య’ వాయిదా
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నడిగర్ సంఘం వివాదాలతో ఇబ్బందుల్లో ఉన్న విశాల్ కు అయోగ్య సినిమా మరింత తలనొప్పులు తీసుకువచ్చింది. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టెంపర్‌ను అయోగ్య పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేశాడు. విశాల్ ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. వాయిదాకు కారణాలు చిత్రయూనిట్ ప్రకటించకపోయినా ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్, ‘సినిమా రిలీజ్ కోసం తాను చేయాల్సినదంతా చేశాను. ఓ నటుడిగా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. అయినా సరిపోలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వివాదంపై చిత్ర నిర్మాతలు స్పందించాల్సి ఉంది. As I wait. For my hardwork called #ayogya to release. I did my best.more than an https://t.co/nThd9d438M always. I groomed my child since it came on my lap.BUT.not enuf??? #gajjnimohamed. My time will come. I continue my journey Gb pic.twitter.com/yjKHQitJ7O — Vishal (@VishalKOfficial) 9 May 2019 -
అయోగ్య.. మక్కీ టు మక్కీ దించేశారు..!
టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా టెంపర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ మూవీ అయోగ్య. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ సేమ్ టూ సేమ్ టెంపర్ లాగే ఉంది. లొకేషన్స్, విలన్, యాక్షన్ సీన్స్ ఇలా అన్ని టెంపర్నే ఫాలో అయిపోయారు. విశాల్ కథలో చాలా మార్పులు చేసినట్టుగా చెపుతున్న టీజర్ చూస్తే మాత్రం మార్పులు చేసినట్టుగా ఏం అనిపించటంల లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ సినిమా టెంపర్. ఎన్టీఆర్లోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యింది. ఇప్పటికే సింబాగా బాలీవుడ్లో సత్తా చాటిన టెంపర్, త్వరలో కోలీవుడ్‌లోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. -
టెంపర్ బంపర్
రాశీఖన్నా వెరీ కూల్ గర్ల్. అయితే తన టెంపర్ చూపించడానికి రెడీ అయ్యారని సమాచారమ్. ఎందుకలా అంటే? సినిమా కోసం. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో రాశీని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. విశాల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి మురుగదాస్ వద్ద ‘స్పైడర్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహించనున్నారట. వరుస విజయాలతో రాశీ ఖన్నా తెలుగులో దూసుకెళుతున్నారు. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు సైన్ చేశారు. ఇప్పుడు ‘టెంపర్’ చాన్స్. ఇది కచ్చితంగా బంపర్ ఆఫరే. ఎందుకంటే ‘టెంపర్’లో హీరోయిన్ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంది. యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో.. రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ బ్యూటీ అమలాపురంలో ఉన్నారు. నితిన్ హీరోగా రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ జరుగుతోందక్కడ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బాలీవుడ్‌కు సోషల్ మీడియా స్టార్!
సాక్షి, ముంబయి : ఆమె ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ‘ముద్దు’ గన్నుతో కాల్చి హృదయాలను పేల్చేసింది. ఆమె ఎవరు? అని మాత్రం చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుని సోషల్ మీడియా మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్న మళయాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాకుండానే అటు మళయాళం మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా యువహృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ఇంట అడుగుపెడుతోందట. పూరీ, ఎన్టీఆర్ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్ హిట్‌గా నిలిచిన టెంపర్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో, కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రియాను కూడా తీసుకోవాలని కరణ్ జోహర్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇస్తారా?, లేక తెలుగులో మధురిమ చేసిన పాత్ర కోసమా? అనేది వేచి చూడాలి. -
ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం
సాక్షి, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ విషయంపై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘ 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టికి సంయుక్తంగా విక్రయించాము. కానీ, నాకు తెలియకుండా టెంపర్ నవలా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికిలోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చాను. అదే సమయంలో టెంపర్ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు. సినిమా రంగంలో నటులకు, దర్శకుల, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. -
టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్‌లోనే స్థిరపడిన విశాల్ కృష్ణ ఈ రీమేక్‌లో పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టులో శింబు నటిస్తాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ, చివరకు అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం విశాల్ హీరో అని తేలింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అది పూర్తికాగానే టెంపర్ మొదలుపెడతాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్‌కు టెంపర్ సినిమా తెగ నచ్చేసిందని, అందులో ఎన్టీఆర్ చేసిన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు. తెలుగులో జూనియర్ సరసన నటించిన కాజల్ అగర్వాలే తమిళంలోనూ హీరోయిన్గా చేస్తుందట. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అనల్ అరసు మెగాఫోన్ పట్టుకుంటారు. -
జూనియర్ ఎన్టీఆర్ కు 'ప్రిన్స్' ప్రశంస
ప్రిన్స్ మహేష్ బాబు ఆఫ్ స్క్రీన్ లో సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. 'టెంపర్' సినిమా విషయంలో మాత్రం ఈ రూల్ ను బ్రేక్ చేశారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చిందట. జూనియర్ ఎన్టీఆర్ నటన ఆయనను ఆకట్టుకుందట. 'టెంపర్' సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ ను అభినందించారని దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియాతో చెప్పారు. ఎన్టీఆర్ నటన బాగుందని మెచ్చుకున్నారని కూడా వెల్లడించారు. ఒక అగ్రహీరో సినిమాను మరో టాప్ హీరో ప్రశంసించడం తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న సృహృద్భావ వాతావరణానికి అద్దంపడుతోంది. ఇటీవల విడుదలైన 'టెంపర్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. -
దయాగాడి దండయాత్ర!
చిత్రం - టెంపర్, తారాగణం - జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణమురళి, ప్రకాశ్‌రాజ్, కథ - వక్కంతం వంశీ, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - విశ్వ, కందికొండ, భాస్కరభట్ల, కళ - బ్రహ్మ కడలి, కెమేరా - శామ్ కె. నాయుడు, నేపథ్య సంగీతం - మణిశర్మ, యాక్షన్ - విజయ్, ఎడిటింగ్ - ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత - బండ్ల గణేశ్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం - పూరీ జగన్నాథ్ నీతి నిజాయతీలకు మారుపేరైన సిన్సియర్ పోలీసాఫీసర్ల కథలు తీయడం ఒకప్పటి బాక్సాఫీస్ ఫార్ములా. అవి ‘కొండవీటి సింహం’ నాటి రోజులు. అవినీతిపరుడైన పోలీసు అధికారి... దానికి ఓ రీజనింగ్... అనుకోకుండా జీవితంలో ఊహించనిది ఎదురుకావడం... అక్కడ నుంచి మారిన మనిషిగా న్యాయం పక్షం నిలవడం... ఇదీ ఇవాళ్టి సినిమా బాక్సాఫీస్ ఫార్ములా. పదేళ్లక్రితమే వచ్చిన తమిళ ‘సామి’ (తెలుగులో బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహా’కు మాతృక), హిందీ ‘దబంగ్’ (తెలుగులో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’కు మాతృక), ఇటీవలి రవితేజ ‘పవర్’, మొన్ననే వచ్చిన కల్యాణరామ్ ‘పటాస్’ దాకా అన్నీ ఇలాంటి కథలే. సరిగ్గా పూరి జగన్నాథ్, చిన్న ఎన్టీఆర్‌లను కథకుడు వక్కంతం వంశీ ఒప్పించి, ‘టెంపర్’గా తీయించింది కూడా ఇలాంటి కథే. కాకపోతే, దానికి పూరి స్టైల్ కథాకథనం, చిన్న ఎన్టీఆర్ మార్కు ధాటి డైలాగులు అదనపు హంగులు. ఆ కథేమిటో... ‘టెంపర్’ లూజ్ కాకుండా తెలుసుకుందాం. కథేమిటంటే... అనాథగా పెరిగిన దయ (జూనియర్ ఎన్టీఆర్)కు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కోరిక. పోలీసైతే తప్పు చేసినవాళ్ళందరి నుంచి డబ్బులు దండుకుంటూ హాయిగా జీవితం గడిపేయవచ్చని అతని ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్లే డిగ్రీ కొనుక్కొని మరీ ఎస్.ఐ అవుతాడు దయ. చెప్పినమాట వింటూ, తన వ్యాపారాలకు అడ్డు రాని పోలీసు కావాలంటూ విశాఖలోని స్మగ్లింగ్ లీడర్ ‘వాల్తేర్’ వాసు (ప్రకాశ్‌రాజ్), తన మిత్రుడైన మంత్రి గారి (జయప్రకాశ్‌రెడ్డి) సాయం తీసుకుంటాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న దయను విశాఖకు రప్పిస్తాడు మంత్రి. తెలివిగా అవినీతి చేస్తూ, వాల్తేర్ వాసుకు మిత్రుడిగా మెలుగుతుంటాడు ఎస్.ఐ. దయ. పోలీస్ స్టేషన్‌లోని నారాయణమూర్తి (పోసాని కృష్ణమురళి) లాంటి వాళ్ళు వ్యతిరేకించినా, పట్టించుకోడు. సాక్షాత్తూ విలన్ తమ్ముళ్ళను నలుగురినీ వదిలేస్తాడు. ‘పెట్ క్రాస్’ను నడుపుతున్న యానిమల్ లవర్ శాన్వి (కాజల్ అగర్వాల్) ప్రేమలో పడతాడు. విలన్లు వెంటపడి, చంపాలని చూస్తున్న ఒక అమ్మాయిని తన ప్రేమికురాలి కోరిక మేరకు హీరో రక్షిస్తాడు. పెద్ద విలన్‌తోనే తగాదా పడతాడు. ఆ అమ్మాయి ఎవరన్న సస్పెన్స్ దగ్గర ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఆ అమ్మాయి కథ బయటకొస్తుంది. న్యూయార్క్‌లో పనిచేస్తున్న ఆ అమ్మాయి తన తల్లి (పవిత్రా లోకేశ్)తో కలసి చెల్లి కోసం వెతుకుతుంటుంది. తల్లేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ, ఆ అమ్మాయిని విలన్ తమ్ముళ్ళు చెరబట్టి, 40 రోజుల పాటు బంధించి, లైంగిక దాడులకు దిగి, అదంతా తమకు తామే వీడియోలో చిత్రీకరిస్తారు. చివరకు ఆమెను చంపేస్తారు. చనిపోయే ముందు చెల్లెలు చేసిన ఫోన్‌కాల్‌తో ఆ వీడియో సీడీని దక్కించుకుంటుంది అక్క. తన చెల్లికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ ఆ అక్క చేసిన వేడుకోలుతో హీరోలో మథనం మొదలవుతుంది. ఆ తరువాత విలన్ గ్యాంగ్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ సీడీ ఏమైంది? చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా. ఎలా చేశారంటే... ‘‘పేరు ‘దయ’. నాకు లేనిదే ‘దయ’ ’’ అనే ఎస్.ఐ. పాత్రలో చిన్న ఎన్టీఆర్ చలాకీగా ఉన్నారు. యువ హీరోల్లో తనకు మాత్రమే పరిమితమైన స్పష్టమైన వాచకంతో పేరాల కొద్దీ డైలాగులు ఉఫ్‌మని ఊదేశారు. కాజల్ అగర్వాల్ పాటలకు పరిమితమైన పాత్ర. ప్రకాశ్‌రాజ్‌కు ఇలాంటి విలన్ పాత్రలు కొత్తేమీ కాదు. అయితే, ఈ పాత్ర బేలగా హీరోకు లొంగిపోవడం మినహా చేసిందేమీ లేకపోవడంతో హీరో వర్సెస్ విలన్ అనే బలమైన పోరాటం లేకుండా పోయింది. అలీ, సప్తగిరి రెండు సీన్ల కామెడీకి పరిమితమయ్యారు. ఇక, సినిమాలో ఒక సన్నివేశంలో బైక్ నడుపుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక డైలాగ్ వేషంలో కనిపించారు. ఇక, సీనియర్ నటి రమాప్రభ హీరోయిన్‌కు అమ్మమ్మగా అంధురాలి పాత్రలో మెరిశారు. పాటలు పదే పదే వినాలనిపించేలా లేకపోవడం అనూప్ సంగీతంలోని లోపం. మరో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్ దృశ్యాలు సగటు తెలుగు సినిమాలో లాగానే ‘హీరోచితం’గా ఉన్నాయి. కెమేరా వర్క్ బాగుంది. చిన్న ఎన్టీఆర్‌కు నందమూరి వంశాభిమానుల ఆశీస్సుల కోసం తాత పెద్ద ఎన్టీఆర్ (‘కొండవీటి సింహం’), తండ్రి హరికృష్ణ (‘సీతయ్య’), బాబాయ్ బాలకృష్ణ (‘రౌడీ ఇన్స్పెక్టర్’)ల సినిమాల్లోని దృశ్యాలు సినిమా మొదలైన కాసేపటికే తెర మీదకొస్తాయి. ఇక, సెకండాఫ్‌లో ‘నీ తాత టెంపర్... నీ అబ్బ టెంపర్...’ అంటూ ఏకంగా ఒక బృందగీతం కూడా పెట్టారు. ఎలా ఉందంటే... సముద్రపుటొడ్డున రక్తం ఓడుతూ పడి ఉన్న కథానాయకుడు దయ (జూనియర్ ఎన్టీఆర్) నేపథ్యంలో నుంచి తన జరిగిన కథను చెబుతుండగా సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ కొంత విసుగనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ, గమనం క్రమంగా చిక్కబడతాయి. హీరో మారే ఘట్టం, కోర్టులో సీన్, ఊహకందని యాంటీ క్లైమాక్స్ లాంటి వాటితో సినిమా ముగింపు ముందు ఒక అరగంట పట్టుగా సాగుతుంది. రివెంజ్ ఫార్ములాతో, వినోదం తక్కువ పాళ్ళున్న ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లూ ఉన్నాయి, ఎడిటింగ్ కత్తెరకు కొంత పదును పెట్టి, స్క్రిప్టు మీద మరింత నియంత్రణతో వ్యవహరిస్తే బాగుండేది. ‘నే పనికి మాలిన వెధవను... హే భగవాన్...’ పాట లాంటివి కథనానికి అడ్డుపడ్డాయి. చెల్లి కోసం ఒక పక్క తల్లి పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతున్నా, అక్క మాత్రం చెల్లికి జరిగిన అన్యాయాన్నీ, ఆమె బలైపోయిన విధానాన్నీ తల్లికి చెప్పలేదనుకోవాలేమో! హీరోయిన్ కోరిక మేరకు ఆ అమ్మాయిని కాపాడాలని రంగంలోకి దిగిన హీరో మొదటెక్కడా మారినట్లు కనిపించడు. తీరా అమెరికా విమానం ఎక్కబోతూ ఆ అమ్మాయి వచ్చి అన్న మాటలతో మారినట్లు క్రమంగా చూపించారు. అది కొంత మేరకు అర్థం చేసుకోదగినదే. అయితే, తీరా క్లైమాక్స్‌లో జైలులో జరిగే సంఘటనలు, మరో గంటలో ఉరి వ్యవహారమంతా అయిపోతుందనగా న్యూయార్క్ నుంచి లైవ్ టెలికాస్ట్‌లు వగైరా లాజిక్కూ, సహజత్వానికీ దూరంగా ఉన్నాయనిపిస్తాయి. కాకపోతే, సినిమా అనుకొని సరిపెట్టుకోవడం మినహా ఏమీ చేయలేం. ఫస్టాఫ్ చూశాక పెదవి విరిచిన ప్రేక్షకుడు సెకండాఫ్‌లో హీరోలోని మార్పు సీన్, ఊహకందని చివరి కోర్టు సీన్ లాంటివి చూసి కొంత మేరకు పాజిటివ్ టాక్లోకి మారతాడు. ఒక పాటలో సిక్స్ ప్యాక్‌తో, కొన్నిచోట్ల బొద్దుగా సన్నివేశానికో రకంగా కనిపించిన చిన్న ఎన్టీఆర్‌లో ఉత్సాహం, ఊపు మాత్రం తగ్గలేదని పాటలు, డ్యాన్స్‌లు చెప్పకనే చెబుతాయి. అప్పుడెప్పుడో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘రాఖీ’ని గుర్తుచేస్తూ, ఈసారి పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’లో హాస్యం, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు లేకపోవడం ఇబ్బందికరం. అయితే, దాదాపు ఏకపాత్రాభినయం లాగా చిన్న ఎన్టీఆర్ గబగబా మాట్లాడేస్తూ, గట్టిగా చెప్పే డైలాగులు సగటు జనం మాటెలా ఉన్నా అభిమానులకు నచ్చవచ్చు. మొత్తం మీద, చాలాకాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో చిన్న ఎన్టీఆర్‌లు కసితో చేసిన చిత్రంగా ‘టెంపర్’ మిగులుతుంది. అమ్మాయిలను ‘అది’, ‘ఇది’ అంటూ సంబోధించినా, ‘ఫ్లూటిస్ట్’..., ‘కుక్కల క్రాసింగ్’ లాంటి డైలాగులున్నా... (చాలా డైలాగులు సెన్సార్ కట్ అయ్యాయి) చివరాఖరుకు ఈ సినిమా నిర్భయ కేసు లాంటి వాటి నేపథ్యం, మహిళలపై హింసకు వ్యతిరేకత లాంటి సామాజిక అంశాలపై తీసిన చిత్రంగా చలామణీ అవుతుంది. అయితే, ఒకటే షరతు... సగటు తెలుగు సినిమాలు చూడడం అందరికీ అలవాటే కాబట్టి, అతిగా ఊహించుకొని ఈ సినిమాకు వెళ్ళి, ‘టెంపర్’ లూజ్ అయితే, దానికి హీరో, దర్శక, నిర్మాతల బాధ్యతేమీ లేదు. పూరి మార్కు డైలాగుల ఒరవడిలోనే చెప్పాలంటే.... (ఈ) ‘సినిమా ఎవణ్ణీ వదిలిపెట్టదు. అన్ని సరదాలూ తీర్చేస్తది!’ - రెంటాల జయదేవ -
'టెంపర్' సెన్సార్ పూర్తి
చిన్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. 18 కట్స్ తో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు అనుమతి మంజూరు చేశారు. సన్నీ నియోన్ పై ఉన్న డైలాగ్ సహా పలు మాటలు 'మూట్'లోకి వెళ్లాయి. 30 శాతం క్లైమాక్స్ సీన్ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి మొత్తం 141 నిమిషాలున్నట్టు సమాచారం. యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కిన 'టెంపర్' ఫిబ్రవరి 13న విడుదలకానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. తమ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ దక్కిందని బండ్ల గణేష్ ట్విటర్ లో తెలిపారు. 'టెంపర్'ను ఆదరించాలని కోరారు. మొత్తం సినిమాను చూసేందుకు నందమూరి అభిమానులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్టీఆర్ టెంపర్ మూవీ స్టిల్స్
-
టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల
పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ సినిమా టైటిల్ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను రిలీజ్ చేసింది. ఇంతకుముందు సమంతతో రభస చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ పటాస్‌తో మంచి హిట్ కొట్టడంతో.. ఇప్పుడు అదే సెంటిమెంటు ఎన్టీఆర్‌కు కూడా వర్కవుతుందని అంచనా వేస్తున్నారు. టెంపర్ టైటిల్ సాంగ్ వీడియోలో ఎన్టీఆర్ లుక్ బాగా స్టైలిష్‌గా కనిపిస్తోంది. సినిమాను సంక్రాంతికే విడుదల చేయాల్సి ఉన్నా, నందమూరి కుటుంబంలో జరిగిన విషాద ఘటన కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వాలెంటైన్స్‌డేకు ఒక్కరోజు ముందు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ టైటిల్ సాంగును భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఈ పాటకు తారక్ తనదైన శైలిలో డాన్సులు చేస్తాడని అంటున్నారు. 'నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్ ఏ.. బ్లడ్‌లోనే ఉందమ్మా బెండు తీసే టెంపర్.. దమ్మున్న ప్రతోడికి ఉందమ్మా టెంపర్.. సబ్కో ఫటాలే సబ్కో బచాలే నాచ్ నాచ్...' అంటూ ఈ పాట సాగుతుంది. -
'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదల
ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న టెంపర్ సినిమాలో హీరో కొత్త లుక్ విడుదలైంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎన్టీఆర్ మంచి స్టైలిష్‌గా.. టేబుల్ మీద కాలు పెట్టుకుని కుర్చీలో కూర్చున్న ఫొటోను బయటపెట్టారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ బాగా రఫ్‌గా కనిపిస్తున్నాడు. దీన్ని చూసి.. టెంపర్ చిత్రం మీద ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ‘టెంపర్’ సినిమాను వాస్తవానికి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే, దాదాపు పదిరోజుల పాటు సాగిన తెలుగు సినీ కార్మికుల సమ్మె, ఆ వెంటనే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో షూటింగ్‌కు బ్రేక్ పడింది. తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ చేసుకుంటోంది. -
హల్చల్ చేస్తున్న టెంపర్ స్టిల్స్