మైనారిటీ, దళితులపై వివక్ష
దేశంలో పరిస్థితిపై అమెరికా స్వతంత్ర సంస్థ నివేదిక
► 2014 తర్వాత అసహనం పెరిగిందని వ్యాఖ్య
వాషింగ్టన్ : భారతదేశంలో మైనారిటీలు, దళితులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వాతంత్ర కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) అనే స్వతంత్ర సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2014 తర్వాత అసహనం, దాడులు ఎక్కువయ్యాయని, వివక్షతోపాటుగా సంఘ బహిష్కరణ, బలవంతపు మతమార్పిడులు పెరిగాయంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల చర్చ సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ‘కాంగ్రెస్, బీజేపీ పాలనల్లో మైనారిటీలు, దళితులపై దాడులు సర్వసాధారణ మయ్యాయి. అసహనం పెరిగిపోయింది. చట్టాల్లో లొసుగులు, అసమర్థ న్యాయ వ్యవస్థ కారణంగా మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది.’ అని నివేదించింది. భారత ప్రజాస్వామ్యం.. దేశంలోని ప్రతి ఒక్కరికి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమానత్వాన్ని కల్పిస్తుందని.. కానీ దీని ఆచరణ జరగటం లేదని యూఎస్సీఐఆర్ఎఫ్ చీఫ్ థామస్ రెస్సీ తెలిపారు.
కేంద్ర, రాష్ట్రాలు ఈ విషయంలో అలసత్వంతో వ్యవహరిస్తున్నాయన్నారు. భారత్లోని హిందూ సంఘాలకు ఆర్థికసాయం అందిస్తున్న సంస్థలపై అమెరికాలో నిషేధం విధించాలన్నారు. కాగా, ఈ నివేదికను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నివేదిక పూర్తి తప్పుల తడకని, ఇందులోని అంశాల విశ్వసనీయతపై ఎన్నో అనుమానాలున్నాయని తెలిపింది. ‘గతంలోనూ మేం యూఎస్సీఐఆర్ఎఫ్ నివేదికను తిరస్కరించాం. ఇలాంటి విదేశీ సంస్థలిచ్చే నివేదికలను పరిగణించాల్సిన అవసరం లేదు. భారత భూభాగంలోని ప్రజల హక్కులకు ప్రభుత్వం రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తోంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు.