ఒమన్‌లో రూ.65 కోట్లకు భారత మహిళ టోపీ
దుబాయ్: పెట్టుబడిదారులకు రూ.65 కోట్ల మేర టోపీ వేసిన ఓ భారత మహిళ ఒమన్ నుంచి ఉడాయించింది. తాను పలు ప్రాజెక్టులకు ఇన్చార్జినని పేర్కొంటూ ఒమన్ మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ పత్రాలను చూపించి, తమను మోసగించినట్లు బాధితులు తెలిపారు. వారంతా భారత్‌కు చెందినవారేనని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ తెలిపింది. తమ పెట్టుబడికి కొన్ని నెలలవరకూ వడ్డీ సక్రమంగానే చెల్లించిందని, తర్వాత ఎగ్గొట్టిందని ఓ బాధితుడు తెలిపారు. ఆమె ఈ ఏడాది మే నెలలో ఒమన్ నుంచి పరారైందని.. ప్రస్తుతం మంగుళూరులో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె కోట్లు కొల్లగొట్టిందని చెప్పారు. తాము పోలీసు కేసు పెట్టామని.. కోర్టునూ ఆశ్రయించామని చెప్పారు.