నిజంగా పెద్దాయనే
సమతుల్యత పాటిస్తున్న స్పీకర్ తిమ్మప్ప
హుందాతనానికి భంగం వాటిల్లకుండా సభ నిర్వహణ
గాడి తప్పకుండా చర్చ సాగించడంలో సిద్ధహస్తుడు
ఉద్విగ్న పరిస్థితుల్లోనూ హాస్య ధోరణి పండించే చతురత
ఎవరైనా సరే మందలించడానికి ఏమాత్రం వెనుకాడరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ నిర్వహణలో స్పీకర్‌ది మహత్తరమైన పాత్ర. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు కోరుకుంటాయి. తమకు అనుకూలంగా ఉండాలని పాలక పక్షం భావించడమూ కద్దు. ఈ విషయంలో సమతుల్యతను పాటించడం ద్వారా అందరి మెప్పు పొందడం అంత సులభమైన పని కాదు. కానీ శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇప్పటి వరకు ఆ పదవి హుందాతనానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా వ్యవహరించడంలో సఫలీకృతులయ్యారు.
సభా నిర్వహణలో అనుసరిస్తున్న హాస్య ధోరణి కూడా ఆయన పట్ల పాలక, ప్రతిపక్షాలకు గౌరవం పెరగడానికి కారణమవుతోంది. గాడి తప్పిన మంత్రులైనా, సభ్యులైనా...ఎవరైనా సరే మందలించడానికి ఏమాత్రం వెనుకాడరు. సభలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నప్పుడు హాస్య చతురతను ప్రదర్శిస్తూ వాతావరణాన్ని తేలిక పరచడంలో ఆయన సిద్ధహస్తులు. కొన్ని మాటలు ఇతరులకు నిష్టూరంగా అనిపించినప్పటికీ, చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. శుక్రవారం సభలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆయన బహు ముఖ వైఖరిని చెప్పకనే చెబుతాయి.
ఎమ్మెల్యేలు ఎక్కడ...?
పలువురు సభ్యుల సావధాన తీర్మానాలను సభలో చేపట్టినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు లేరు. సావధాన తీర్మానం ప్రవేశ పెట్టదలచిన ఎమ్మెల్యేల పేర్లను చదువుతూ పోతుంటే...ఒకరిద్దరు మినహా అందరూ గైర్హాజరైనట్లు తేలింది. ఈ దశలో కాస్త అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ ‘ఏరండీ...ఎమ్మెల్యేలు’ అంటూ సభ వైపు ప్రశ్నార్థంగా చూశారు. అలా గైర్హాజరైన ఎమ్మెల్యేల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ‘ఏమైంది ఈ పిల్లలకు. ఏదో అడగాలనుకుంటారు. తీరా వాటిని చేపట్టినప్పుడు కనిపించరు’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
మంత్రికి అక్షింతలు
విద్యార్థులతో గత వారం నగరంలో జరిగిన రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమంలో అధికార దుర్వినియోగం జరిగిందంటూ జీరో అవర్‌లో ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీ శాఖ మంత్రి రమానాథ్ రై బీజేపీ సభ్యులపై ఎదురు దాడికి దిగారు. స్పీకర్ వారించినా ఆయన వైపు చూడకుండా ఆవేశంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ దశలో స్పీకర్ లేచి నిల్చుని తక్షణమే కూర్చోవాల్సిందిగా మంత్రికి హుకుం జారీ చేశారు. తిరిగి ఆయన ఏదో మాట్లాడడానికి ప్రయత్నించడంతో ‘మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదు. సభా కార్యకలాపాల్లో సక్రమంగా ఉండాలి’ అని ఉద్భోధించారు. మళ్లీ మంత్రి ఏదో మాట్లాడబోతుండగా...చాలు, ఊర్కోండి అంటూ వారించారు. చేసేది లేక మంత్రి మౌనంగా కూర్చుండిపోయారు.
హైదరాబాద్ కాంట్రాక్టర్లతో జాగ్రత్త సుమా..!
కాంట్రాక్టర్ల విషయంలో స్పీకర్ ప్రభుత్వానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో రామనగర నుంచి డాబస్‌పేట మీదుగా పావగడ వరకు జరుగుతున్న రోడ్డు పనులు నాసి రకంగా ఉన్నాయని ఓ సభ్యుడు ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప దృష్టికి తీసుకు వచ్చారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ ‘హైదరాబాద్ నుంచి వచ్చే కాంట్రాక్టర్లు ఇక్కడ పని చేయరు. సబ్ కాంట్రాక్టులు ఇచ్చి వెళ్లిపోతారు. దీని వల్ల పనులు నాసి రకంగా ఉంటాయి. హైదరాబాద్ కాంట్రాక్టర్లపై కాస్త నిఘా వేయండి’ అని ప్రభుత్వానికి జాగ్రత్తలు చెప్పారు.