పింఛను అడిగితే తల పగులగొట్టారు
ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అరాచకం
ఏలూరు: ‘పింఛను ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదయ్యూ. ఆ డబ్బులు ఇప్పించి కాస్త పుణ్యం కట్టుకోండయ్యూ..’ అని అడిగినందుకు ఓ వృద్ధుడి తలను కార్పొరేటర్, అతడి తల్లి, అనుచరుడు కలిసి సీసాతో పగులగొట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గురువారం సంచలనం కలిగించింది. ఏలూరు తూర్పువీధిలో నివసించే వృద్ధుడు తిరుమలశెట్టి రాజు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు పింఛను రావటం లేదని గురువారం సాయంత్రం 10వ డివిజన్ కార్పొరేటర్ పోలిశెట్టి తులసీరామ్ ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అతడిపై కార్పొరేటర్ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నాడు. ‘పింఛను అడగటానికి వస్తే తిడతారేంటి బాబూ..’ అని ఆ వృద్ధుడు అనడంతో మరింత ఆగ్రహించిన కార్పొరేటర్ అతడి గుండెలపై తన్నగా, అనుచరులు బరబరా ఈడ్చేశారు. సమీపంలో ఉన్న మద్యం సీసాను వృద్ధుడి తలపై మోదడంతో అతడికి తీవ్రగాయూలయ్యూరుు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పింఛనడిగితే నేరమా
పింఛను పెంచారని తెలిసి సంబరపడ్డాను.అందితే తిండి దొరుకుతుందని ఆశపడ్డాను. ఆ మొత్తం పెంచలేదు సరికదా.. గతంలో ఇచ్చే రూ.200 కూడా ఇవ్వటం లేదు. ఏమైందో తెలుసుకుందామని కార్పొరేటర్ ఇంటికి వెళ్లాను. పింఛను ఇప్పించి ఆదుకోమని అడిగాను. అంతే కార్పొరేటర్ నన్ను గుండెలపై తన్నారు. పక్కనే ఉన్న ఆయన తల్లి, అనుచరులు నాపై దాడికి దిగారు. ముసలాడినని కూడా చూడకుండా కొడతారేంటని అడిగాను. కార్పొరేటర్ ప్రోద్బలంతో ఆయన అనుచరుడు నారాయణ నాతలపై మందు సీసాతో కొట్టాడు. దాడి చేయమని వాళ్ల నాయకుడు చెప్పాడా? నాకు పింఛను ఇప్పించి న్యాయం చేయండి..
- తిరుమలశెట్టి రాజు, బాధితుడు
నేను కొట్టలేదు
పింఛను రాలేదని ఆ వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు. సిబ్బంది లేరు తరువాత రమ్మని చెప్పాను. పక్కనే ఉన్న నారాయణ అనే వ్యక్తి ఆ వృద్ధుడిని వారించే ప్రయత్నం చేయగా అతణ్ణి తోసేశాడు. నేను మాత్రం వాడిని కొట్టలేదు. వారించిన నన్ను కాలర్ పట్టకోవడంతో స్థానికులు కలుగజేసుకుని బయటకు ఈడ్చుకెళ్లారు. మద్యం తాగి.. వెంట సీసా తెచ్చుకున్న ఆ వృద్ధుడు తన తలపై తానే సీసాతో కొట్టుకున్నాడు.
- తులసీరామ్, కార్పొరేటర్