ప్రణతి ప్రణతి.. ప్రణవనాద జలధికి..
నాలుగు చినుకులు నెత్తిన పడగానే మేని పులకిస్తుంది. మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది. నిస్సత్తువ పటాపంచలవుతుంది. ఎక్కడా లేని కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. పంచభూతాల్లో ఒకటైన నీటికి ఉన్న మహత్మ్యం అది. అందుకే.. గోదారి గంగమ్మను భక్త జనమంతా జలదేవతగా ఆరాధిస్తారు. నెత్తిన నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకుంటారు. అంతటి విశిష్టత గల గోదారమ్మకు అంత్య పుష్కర వేళ భక్తులంతా ప్రణతులర్పిస్తున్నారు. పాపాలను బాపే ఆ అమ్మను సేవించి తరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాల జోరు కొనసాగుతోంది. పదో రోజున కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అంత్య పుష్కర ఘట్టం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఒడిశాలోని కటక్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, షాజాపూర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. రోజంతా ఇక్కడే ఉండి.. గోదావరి గట్టున వంటలు చేసుకుని ఆరగించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మంగళవారం సుమారు 20 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. వరద ఉధృతి కొనసాగడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లలో భక్తులను స్నానాలకు అనుమతించలేదు. తాళ్లపూడిలోని ఘాట్లలో సగానికి పైగా ముంపులో ఉన్నాయి. కేవలం మూడు మెట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రేవుల్లో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి.
ఘాట్ల వద్ద కేవలం ఒక్కొక్క పడవను మాత్రమే ఉంచారు. పట్టిసీమ, పోలవరం, గూటాల పుష్కర ఘాట్లలోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పట్టిసీమ ఘాట్లో విజయనగరం జిల్లా భక్తులు పుష్కర స్నానం చేశారు. సాయంత్రం గోదావరి మాతకు హారతి ఇచ్చారు. నరసాపురానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోడేరు పుష్కరఘాట్లో భక్తులు పెద్దఎత్తున పుణ్యస్నానాలు చేశారు. కరుగోరుమిల్లి పుష్కరఘాట్ మంగళవారం కూడా వరద గుప్పెట్లోనే ఉండటంతో పుష్కర స్నానాలను అధికారులు నిలిపివేశారు. కేదారీ ఘాట్లో పుష్కర స్నానాలు చేసి పెనుగొండలో వాసవీ మాతను దర్శనం చేసుకుని వెళుతున్నారు. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లిపోవడంతో ఘాట్ల వద్ద బందోబస్తు లేదు. చివరి రెండు రోజులైనా పోలీసులను ఏర్పాటుచేయాలని ఘాట్ అధికారులు కోరుతున్నారు. కాగా, పారిశుధ్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాకపోవడంతో ఆయా శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు.