'మేక్ ఇన్ ఇండియా'కు ఎయిర్‌బస్ మద్దతు
తౌలోస్ (ఫ్రాన్స్): భారత 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మద్దతు తెలిపింది. తాము భారత్‌లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ''మోదీ 'మేక్ ఇన్ ఇండియా' పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్‌లో తయారు చేయటానికి మేం సిద్ధం'' అని చెప్పారు.
భారత్‌లో ఎయిర్‌బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతికపరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు.