ఈ-కాప్స్ సేవలు ప్రారంభం
కరీంనగర్‌క్రైం : క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్)లో భాగంగా ఇంటర్ ప్రైస్ ఈ-కాప్స్ విధానాన్ని ఎస్పీ వి.శివకుమార్ బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కేఎస్.వ్యాస్ స్మారకహాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ పోలీసు శాఖ తన సేవలను విసృతం చేస్తోందన్నారు.
మున్ముందు కాగిత రహిత పాలన అందుబాటులోకి రానున్నదని చెప్పారు. మారుమూల పోలీస్‌స్టేషన్ నుంచి దేశ రాజధాని వరకు పోలీసుల సేవలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు సీసీటీఎన్ఎస్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ విధానం అమలు కోసం పోలీస్‌స్టేషన్ రైటర్లు, ఎస్హెచ్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆవగాహన పెంచుకుని మెరుగైన సేవలందించాలన్నారు.
ఆరు నెలల పాటు సీసీటీఎన్ఎస్ విభాగం తరపున సాంకేతిక నిపుణులు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఓఎస్డీ సుబ్బరాయుడు, డీసీఆర్బీ డీఎస్పీ సంజీవరావు, ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ సర్వర్, ఆర్ఐ గంగాధర్, ఐటీ కోర్‌టీం ఇన్చార్జి ఎంఎస్.ఖురేషి, ఐటీ కోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ఫిబ్రవరిలో డయల్ 100 సేవలకు 3914 అత్యవసర ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు తెలిపారు.