వాహ్ ఏం మాట్లాడిండు భయ్...!
తమ పార్టీ సీనియర్ నేతల ముదురు రాజకీయాల ముందు ఎవరైనా బలాదూరేనని టీ కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు వారి రాజకీయ వ్యూహాలు, చిత్రవిచిత్రమైన జిమ్మిక్కుల ముందు ఎవ్వరూ నిలబడలేరని ఒకింత వ్యంగ్యంగానే తమలో తాము మాట్లాడుకుంటున్నారట. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో చిక్కుకుని దశల వారీగా కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నా.. అందుకు అవసరమైన వాదనను కూడా సీనియర్‌నేతలు తయారు చేసుకుంటుండడంపై విస్మయం వ్యక్తమవుతోందట. తాజాగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడంపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.
టీసీఎల్పీ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారిన నేపథ్యంలో తనపై విమర్శల వర్షాన్ని తప్పించుకునేందుకు అన్ని పదవులకు రాజీనామా చేయనున్నట్లు జానా ప్రకటించడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటున్నారు. ఫిరాయింపులను నియంత్రించడంలో ముఖ్యనేతలు విఫలమయ్యారనే విమర్శలు పెల్లుబికి, తమ పదవులకు పెద్ద నేతలు రాజీనామా చేయాలనే డిమాండ్ రాకముందే ఆయన ఆ ప్రకటన చేయడంతో ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయగలిగారంటున్నారు. రెండోరోజే తమ రాజీనామాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుమతిస్తేనే అని షరతులతో కూడిన ప్రకటన చేయడంతో రాజకీయమంటే ఇదేనని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారట. అటు కర్ర విరగకుండా పాము చావకుండా చేయడం తమ ప్రకటనలతో జాణతనాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారట....