పల్లకీ యాత్రకు ఘన స్వాగతం
- తుకారం మహరాజ్‌కు పుష్పవర్షం కురిపించిన భక్తులు
- ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన తెలుగు మాల సంఘం
పింప్రి: జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ పల్లకీ యాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం 11 గంటలకు దేహులో ఇనాందార్వాడ నుంచి పింప్రి, చించ్వడ్ వైపు సాగింది. అంతకు ముందు ఉదయం 4.30 గంటలకు హారతి, కీర్తనలతో మహాపూజ నిర్వహించారు. దారిపొడవునా భక్తులు పుష్పవర్షం కురిపించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు అనగడ్ షాహ బాబా దర్గాకు పల్లకీ చేరుకోగానే తరతరాల ఆచారం ప్రకారం అభంగ్, హారతి ఇచ్చారు. తర్వాత చింబోలి గ్రామంలోని పాదుకా మందిరానికి తుకారం వెండి పాదుకల పల్లకి చేరుకుంది. ఈ రాత్రికి ఆకృడిలోని విఠల్ రుక్మిణీ దేవాలయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది.
సాంప్రదాయిక ఆహ్వానం
చింబోలి గ్రామంలో అత్యధికంగా నివసించే తెలుగు ప్రజలు సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి పల్లకికి ఘన స్వాగతం పలికారు. దేహురోడ్డు, చించోలికి చెందిన తెలుగు మాల సమాజ్ ఆధ్వర్యంలో పళ్లు, ఫలహారాలను వార్కారీ (భక్తులు) లకు పంచారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వీటిని అందజేశారు. తెలుగు మాల సమాజ్ సంస్థ అధ్యక్షుడు శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజు వెంకటేశ్, రాందాస్ దాసరి, ఈరేశ్ హాలహర్వి, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా వార్కారీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా వార్కారీలకు సేవ చేస్తున్నామని, భగవంతునికి సేవ చేసినట్లుగా తాము భావిస్తున్నామని సంఘం సభ్యులు చెప్పారు.