వ్యాన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం
పూండి, న్యూస్‌లైన్: వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం హరిదాసుపురానికి చెందిన కురుమోజు సతీష్ (17) కాశీబుగ్గ డాక్టర్ కణితీస్ ఐటీఐలో చదువుతున్నాడు. బుధవారం పూండికి చెందిన కొంచాడ ధర్మారావు ద్విచక్రవాహనంపై పూండి నుంచి కాశీబుగ్గ వెళుతుండగా బెండిగేటు సాయిబాబా మందిరం సమీపంలో మలుపు వద్ద కాశీబుగ్గ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం తునాతునకలైంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి పరారైన వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌ను బుధవారం సాయంత్రం వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు తవుడు, అమ్మన్నమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ యజమాని కనీసం పరామర్శకు రాకపోవడంపై కుటుంబ సభ్యులు కారువాడు, లోకనాథం, శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎస్.తాతారావు తెలిపారు.