లక్కీ స్కీమ్ పేరిట కుచ్చుటోపీ
=భీమవరం వాసి సత్యనారాయణరాజు నిర్వాకం...
= జిల్లాలో 2,500మంది బాధితులు
=146 మందికి రూ.12 లక్షలు బాకీ ఉన్నానంటూ నోటీసులు!
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : లక్కీ స్కీమ్ పేరు తో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెం దిన పి.సత్యనారాయణరాజు మోసగించాడం టూ గుడ్లవల్లేరు ప్రాంతవాసులు గురువారం పో లీసులకు ఫిర్యాదు చేశా రు. స్కీమ్ నిర్వాహకుడు కైకలూరు, హనుమాన్‌జంక్షన్, గుడ్లవల్లేరు, తిరువూరు, ఉ య్యూరు ప్రాంతాల్లో నాలుగేళ్లగా చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గృహోపకరణాలు సులభ వాయిదాల్లో ఇస్తామంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లు ముద్రించి జిల్లాలో 250మంది ఏజెంట్లతో 2,500 మందిని ఆకట్టుకుని స్కీములో చేర్చుకున్నాడు.
లక్కీడిప్‌లు తీస్తూ తనకు అనుకూలమైన కొంతమంది సభ్యులకు అప్పుడపుడూ బహుమతులు ఇవ్వటంతో పలువురు మహిళలు ఆకర్షితులయ్యారు. ఒక్క గుడ్లవల్లేరు మండలంలోనే 50 మంది ఏజెంట్లతో 500 మంది సభ్యులను స్కీమ్‌లో చేర్పించాడు. వాయిదాలు పూర్తిగా చెల్లించిన తరువాత వస్తువులు ఇవ్వకుండా ఉడాయిం చాడు. ఇటీవల ఉయ్యూరులో బోర్డు తిప్పేసిన పద్మావతి సేవింగ్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఈ ప్ర బుద్ధుడిదే. జిల్లావ్యాప్తంగా నష్టపోయిన పలు వురు సభ్యుల నుంచి కోట్లాది రూపాయలు ఈ స్కీమ్ కింద నిర్వాహకుడు దండుకున్నట్లు గుడ్లవల్లేరు పోలీసులకు ఏజెంట్లు, బాధితులు ఫిర్యా దు చేశారు. స్థానిక జేమ్స్‌పేటలో ఒక ఇంటిలో గృహోపకరణాలు ఉంచాడని, వాటిని తమకు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఐపీ నోటీసులు
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్నసత్యనారాయణరాజు ముందు జాగ్రత్త తీసుకున్నాడు. తాను ప్రాంసరీ నోట్లపై 146 మంది వద్ద రూ.12 లక్షలు రుణంగా తీసుకున్నానని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు ఇన్సాల్వెన్సీ పిటిషన్(ఐపీ)లో ఆయా వ్యక్తుల జాబి తాను పంపటం గమనార్హం.
తన వద్ద సొమ్ము లేదని, అందుకే ఐపీ దాఖలు చేసినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ జాబితా ను పరిశీలిస్తున్నామని ఎస్సై ఎ.ఫణిమోహన్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్యనారాయణరాజుపై కేసు నమోదు చేయనున్నామన్నారు.
గృహోపకరణాల నిల్వను పరిశీలించిన ఎస్సై
నిర్వాహకుడు లక్కీ స్కీమ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిని ఎస్సై ఫణిమోహన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డోకాల కనకరత్నారావు ఆయనను కోరారు. ఈ కేసు కోర్టుకెళ్లాక పోలీసు ఉన్నతాధికారులు, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం గుడ్లవల్లేరులో స్కీమ్ నిర్వాహకుడు నిల్వ చేసిన గృహోపకరణాలతో బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎస్సై సమా ధానమిచ్చారు.