‘నష్టపోయాం .. ఆదుకోండి ’
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వేలాది రూపాయలు డిపాజిట్ కట్టి స్టాల్స్ పెట్టుకున్నాం.. రోజుకు 700 బిర్యాని ప్యాకెట్లు పారబోయాల్సి వస్తోందని స్టాల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రెండు గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ బస్టాండ్, హౌసింగ్బోరు డకాలనీలోని తాత్కాలిక బస్టాండ్, లూథర్ గిరిలోని పుష్కరనగర్, సాంస్కృతిక కళాశాలలోని పుష్కర నగర్ లను సందర్శించారు. ఏర్పాట్లు, సౌకర్యాలపై భక్తులను ఆరా తీశారు. ఇంకా ఏం కావాలంటూ అడిగారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని తాత్కాలిక బస్టాండ్‌లో రూ.14 వేలు చెల్లించి బిర్యానీ పాయింట్ స్టాల్ ఏర్పాటు చేసిన సత్యరెడ్డి అనే వ్యాపారి చంద్రబాబు వద్ద తన గోడు వెళ్లగక్కాడు. రోజూ రూ.700 వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లు తయారు చేసినా అమ్ముడు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కట్టిన డిపాజిట్ సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ ప్రాధేయపడ్డాడు. వ్యాపారికి న్యాయం జరిగేలా చూడాలని, డిపాజిట్ వెనక్కి ఇచ్చేలా అధికారులు ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఇలా పలువురు వ్యాపారులు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.