venu sankoju
-
కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ సమ్మెలో కూర్చునేవారు
సాక్షి, హన్మకొండ: కాళోజీ సోదరులు ప్రజాస్వామిక విలువలకు దర్పణం వంటివారని కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు డాక్టర్ కాత్యాయనీవిద్మహే అన్నారు. ప్రజాస్వామ్య భావన ఇద్దరిలోనూ సామాన్య లక్షణమని, ఈరోజు కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మెలో కూర్చోవడమే కాకుండా మనల్ని కూడా పాల్గొనమని చెప్పేవారని పేర్కొన్నారు. కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యాన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బుధవారం రాత్రి కాళోజీ యాదిసభ, కాళోజీ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమంలో కాత్యాయనీ విద్మహే మాట్లాడారు. ఆధీకృత హింస రాజ్యమేలుతుంటే ప్రతిహింస తప్పెలా అవుతుందని కాళోజీ ప్రశ్నించారని, వర్తమాన పరిస్థితులలో ప్రతిరోజూ ఆయన గుర్తుకు వస్తుంటారని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాలను గౌరవించడమని, కవులు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పారని గుర్తు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవారని, తాను నక్సలైట్ కానప్పటికీ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు. కుటుంబ విలువలు, సోదర ప్రేమకు చిహ్నంగా నిలిచిన కాళోజీ సోదరులు ఒకే కొమ్మకు రెండు రెమ్మల వంటి వారన్నారు. వేణు సంకోజు ఇప్పటికీ నిజాయితీ, హృదయం గల కవిగా నిరూపించుకున్నారని.. అందుకే కాళోజీ అవార్డును ఇచ్చి గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రముఖ కవి, సుప్రసిద్ధ సాహితీవేత్త వేణు సంకోజు, విజయలక్ష్మి దంపతులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి రామాచంద్రమౌళి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం
సాక్షి, నల్లగొండ: సాహితీసేవకుడు.. వేణు సంకోజుకు ప్రతిష్టాత్మకమైన కాళోజీ–2019 సాహితీ పురస్కారం వరించింది. ఆయన బుధవారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన వేణు సంకోజు 5 దశాబ్దాలుగా అనేక కవితలు, రచనలతో సాహితీ సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జనర్నలిజంలో పీజీడీ సాధించారు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు సాగిస్తున్నారు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన రచనలు 1995లో మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఆవిష్కరించడం విశేషం. 2001లో మలి కవితా సంపుటి మనం, 2008లో నేల కల, ప్రాణ ప్రదమైన కవితా సంపుటిలను ప్రచురించారు. 2008లో స్పర్ష కథల సంపుటి, ఇదే సంవత్సరం తెలుగులో కథా సాహిత్య పరిశోధనకు గాను ఎంఫిల్ పట్టాను పొందారు. విద్యార్థినుల రచనలతో చలనం అనే ఒక ప్రయోగాత్మక సంపుటిని, ప్రతిజ్ఞ అనే శ్రీశ్రీ సాహిత్య విశేష సంచికను ప్రచురించారు. ఉద్యమాల్లోనూ..కీలకపాత్ర 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కీలక సంబంధాలను కలిగి ఉండి అనేక ప్రసంగాలు, కవితా పఠనాలు, పత్ర సమర్పణలు చేశారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించి 2007 వరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2005 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పౌర శాస్త్ర పాఠ్యప్రణాళికా సభ్యునిగా, రచయితగా భూమిక నిర్వహించారు. ఇదే సంవత్సరం సుద్దాల హనుమంతు మోనోగ్రాఫ్ నిర్మాణంలో తెలుగు అకాడమీలో కీలకపాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జేఏసీలో కీలకబాధ్యతలు నిర్వర్తించారు. పురస్కారాలు 2001లో మనం అనే కవితా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందజేసింది. 2014లో తెలంగాణ అమెరికా ఎన్నారైల సంఘం వారు సాహితీ సేవ పురస్కారాన్ని అందజేశారు. 2002లో రామన్నపేట కాళోజీ కళావేదిక పురస్కారం, 2004లో చౌటుప్పల్ అక్షర భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం, 2006లో భువనగిరిలో ప్రజాభారతి పురస్కారం, 2012లో నెలవంక– నెమలీక సాహిత్య మాస పత్రిక వారి వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2012లో స్థానిక తేజస్విని సంస్థ పక్షాన జీవన సాఫల్య పురస్కారం, 2014లో ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారం , కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం, 2018లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. కాళోజీ స్మారక పురస్కారం గర్వకారణం కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం రావడం గర్వంగా ఉంది. నాకు ఆయనతో ఎనలేని అనుబంధం ఉంది. 1995లో నేను రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. నాకు అందిన సాహితీ సా హిత్య పురస్కారాలన్నింటిలో ఇది ఎంతో ఆ త్మీయమైనదిగా భావిసు ్తన్నా. ఆయన ఉద్యమాలు, ఆయన రచనల ద్వా రా నేను ఇప్పటికే స్ఫూ ర్తిని పొందుతుంటాను. నేటి తరం కవులకు, రచయితలకు కాళోజీ నారాయణరావు ఆదర్శనీయులు. – వేణు సంకోజు -
విస్మృత కవికి 80 ఏళ్లు
"ప్రజల నాలుకల పత్రాలపై హృదయ ఫలకాలపై ప్రాప్తించని నా కవిత" అంటారు గింజల నరసింహారెడ్డి. కవి అన్న మాటకు పర్యాయపదంగా నిలిచేవాడు ఈతడు. అందుకే, ఎరిగినవారెవరైనా ఈతడిని "కవిగారూ" అనే సంబోధిస్తారు. ఏ కోణంనుంచి వెలకట్టినా ఈతడు మహాకవి అవుతాడని అభిప్రాయపడ్డారు శేషేంద్రశర్మ. అంతటితో ఆగక, "ఆయన ఎత్తులకు ఎదిగే పాఠకలోకం తెలుగుదేశంలో అభివృద్ధి కావాలి" అని ఆకాంక్షించారు. పద్యరచన చేసే కవుల్లో అతికొద్దిమంది మాత్రమే గింజల వారి దరిదాపులకు రాగలుగుతారని మూల్యాంకనం చేశారు నోముల సత్యనారాయణ. చాలాకాలం వరకు ఈయన కవిత్వం రాయలేదు. మనసులో అనుకున్నాడంతే. అసాధారణమైన ధారణ అతడి సిసలైన ఆస్తి గనుక ఏ కవితను వినిపించమని ఎప్పుడడిగినా, ఒక్క నిమిషం మౌనంగా మననం చేసుకుని గుక్కతిప్పుకోకుండా వినిపించేవాడు. ప్రఖ్యాత సంస్కృతాంగ్ల పండితులు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి చిన్ననాటి పద్యంలోని ఒక పాదాన్ని ఎన్.జి.కళాశాలలో వీరు పూర్తిచేసినప్పుడు మనసారా ఆలింగనం చేసుకున్నారు. గింజల వారి "ఊహాకృతి" అన్న చిన్న కవితాసంపుటి 1962లో వెలువడింది. తరువాత 1994లోగాని రెండవ కవితాసంపుటి "శక్తిధార" వెలువడలేదు. "ఏమున్నది వ్యర్థపు వాగ్వాదంలో?/ ఏమున్నది వ్యర్థపు వాక్పాతంలో?" అంటూ. అది కూడా మిత్రుల ప్రోద్బలంతోనే సాధ్యమైంది. ఈ సంపుటి వెలువడుతుందని తెలిసి గింజల సహపాఠి ఆచార్య చేకూరి రామారావు స్నేహవాత్సల్యంతో నల్లగొండకు విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు. అంతకుముందెన్నడూ ఎరుగని ఆ కవితాధార, ఆ శబ్ద చయనం, సమాస నిర్మాణ కౌశలంలో శ్రీనాథుడే అనిపించేంతటి ఆ సమ్యకు మంత్రముగ్ధులయ్యారంతా. మధుమాసాన్ని "ద్యుతి మాసం"గా సంభావించి "చర్విత చర్వణగతిపై/ ధ్వజమెత్తుట మధుమాసం/ మధుమాసం ఇదో నవత/ మోసులెత్తు అవకాశం" అంటాడాయె; "మాట చేత ఒకటే దు/ ర్మార్గుల నెదిరించేయెడ మాట చేత ఒకటే మా/ టాడుట వీరత అగునెడ" మాటామంటా ఒకటేనని నిర్ధారిస్తాడాయె; "కాంతి తనువుగా/ మనశ్శాంతి జగద్వ్యథా దూరీకరణయత్నంగా/ కదలాలనిపిస్తుంది, శబ్ద/ కమ్రతతో స్తబ్ధతను వదలాలనిపిస్తుంది అంటూ "అంతశ్చేతన"ను బయల్పరుస్తాడాయె;"శైశవం కవితారూపం ధరించి సాక్షాత్కరిస్తుంది పాశవికతా లక్షణప్రతిబంధకంగా నిలుస్తుంది" అని అపురూపంగా వ్యాఖ్యానిస్తాడాయె!. ఇంతటి కవిలో ఏకకాలంలో ఒక శ్రీశ్రీ, ఒక విశ్వనాథ, ఒక కృష్ణశాస్త్రి, ఒక మయకోవిస్కీ, ఒక టాగోర్, ఒక ఎమర్సన్, ఒక నెరుడా కనిపించటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు పాఠకులు, శ్రోతలు. "శక్తిధార" ద్వారా గింజల విశ్వరూపం పొడకట్టింది లోకానికి. అతడు కోరిన నవజగం, ప్రతిపాదంలో, పదంలో ఆవిష్కృతమైంది. అతడి భావతీవ్రతకదొక "నికష" అయి నిలిచింది. ఇక, మూడవ కవితాసంపుటి "శబ్దధనువు" 1997లో వెలువడింది. భాష మీద, శిల్పం మీద గింజలకు గల సాధికారిక ప్రజ్ఞ మరొకమారు మరింత బలీయంగా వెల్లడైంది. పద్యం, గేయం, వచనం, ఏది రాసినా అందులో మాధుర్యాన్నీ, లయనూ, అట్లాగే ఒక శక్తినీ కూరడం ఈతని ప్రత్యేకత. తాదాత్మ్యం చెందని వ్యక్తీకరణను సుతరామూ ఒల్లడు. ఆపాదమస్తకం క్రియాత్మకత వుంటేనే ఇష్టపడతాడు రచనలను. ఆతడి మాటల్లోనే చెప్పాలంటే, "కవి తన కవితకు తానే ప్రథమ పాఠకుడు, ప్రథమ శ్రోత. కాబట్టి తనకు తృప్తి కలిగించని కవితలు వృథా". ప్రగతి కాముకమైన భావాలతోనే కొసదాకా నిలవటం, పేదలు, శ్రామికుల పక్షపాతం వహించటం, దౌష్ట్యాన్ని, నియంతృత్వాన్ని ఎదిరించటం; సమతకై నిరంతరం సాహిత్య సమరం చేయటం– అన్నవి నరసింహారెడ్డి ఆనవాళ్లు. ఏది రాసినా అన్నింటా, నిస్వార్థ సేవ, అంకిత భావం, మానవీయ విలువలు, త్యాగాలకే ఈతడు చోటిస్తూ వచ్చాడు. భేషజాలనూ, కుహనా పోకడలనూ, శుష్క అనుకరణలనూ బాహాటంగా వ్యతిరేకించాడు. "ఆకలితో బాధపడేవాళ్లను ఆదుకొనక వేదాంతం దేనికి?/ చీకటిలో బాధపడేవాళ్లకు చూపక దారి– ప్రసంగాలు దేనికి?" అని గట్టిగా నిలదీశాడు. ఈతని ప్రకారం కవి ఆవశ్యకాలు, జగతి ఆవశ్యకాలు వేరుకావు. కనుకనే "సుకవి నిజంగా తనకు ఆవశ్యకాలనే వ్రాస్తాడు/ జగతి ఆవశ్యకాలు అతనికావశ్యకాలు ఒక రకమే చాలా వరకు" అని అన్నాడు. కవితకూ శాస్త్రానికీ అభేదం పాటిస్తూ "కవితకు శాస్త్రానికి ఉన్న భేదమెంత?/ నీటికి నీటి ఆవిరికి అనిపించేటంత" అని తేల్చిపారేశాడు. మట్టి అన్నా మట్టిని నమ్ముకున్న రైతులన్నా ఈతనికి అలవిమాలిన ప్రేమ. "మట్టితల్లి పైకెత్తిన చేయి/ తెరిస్తే బిడ్డలకు మణులు" అంటూ పొంగిపోయాడు. చివరగా "శక్తి జ్ఞానమె, దీప్తి జ్ఞానమె/ సౌఖ్య సకల ప్రాప్తి జ్ఞానమె" అని ప్రగాఢంగా నమ్ముతూ, "జిజ్ఞాసచే బ్రతుకు/ జ్ఞానం జిజ్ఞాస పరిణామపు తళుకు" అంటున్న గింజల కవితలతో మనమూ మెరుద్దాం; చైతన్యమై కురుద్దాం. (1937 డిసెంబరు 28న జన్మించిన గింజల నరసింహారెడ్డికిది 80వ సంవత్సరం) - వేణు సంకోజు 9948419881