విస్మృత కవికి 80 ఏళ్లు | remembrance of ginjala narsimhareddy | Sakshi
Sakshi News home page

విస్మృత కవికి 80 ఏళ్లు

Published Mon, Jan 30 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

విస్మృత కవికి 80 ఏళ్లు

విస్మృత కవికి 80 ఏళ్లు

"ప్రజల నాలుకల పత్రాలపై హృదయ ఫలకాలపై ప్రాప్తించని నా కవిత" అంటారు గింజల నరసింహారెడ్డి. కవి అన్న మాటకు పర్యాయపదంగా నిలిచేవాడు ఈతడు. అందుకే, ఎరిగినవారెవరైనా ఈతడిని "కవిగారూ" అనే సంబోధిస్తారు. ఏ కోణంనుంచి వెలకట్టినా ఈతడు మహాకవి అవుతాడని అభిప్రాయపడ్డారు శేషేంద్రశర్మ. అంతటితో ఆగక, "ఆయన ఎత్తులకు ఎదిగే పాఠకలోకం తెలుగుదేశంలో అభివృద్ధి కావాలి" అని ఆకాంక్షించారు. పద్యరచన చేసే కవుల్లో అతికొద్దిమంది మాత్రమే గింజల వారి దరిదాపులకు రాగలుగుతారని మూల్యాంకనం చేశారు నోముల సత్యనారాయణ.

చాలాకాలం వరకు ఈయన కవిత్వం రాయలేదు. మనసులో అనుకున్నాడంతే. అసాధారణమైన ధారణ అతడి సిసలైన ఆస్తి గనుక ఏ కవితను వినిపించమని ఎప్పుడడిగినా, ఒక్క నిమిషం మౌనంగా మననం చేసుకుని గుక్కతిప్పుకోకుండా వినిపించేవాడు. ప్రఖ్యాత సంస్కృతాంగ్ల పండితులు ప్రొఫెసర్‌ లక్ష్మణమూర్తి చిన్ననాటి పద్యంలోని ఒక పాదాన్ని ఎన్‌.జి.కళాశాలలో వీరు పూర్తిచేసినప్పుడు మనసారా ఆలింగనం చేసుకున్నారు.

గింజల వారి "ఊహాకృతి" అన్న చిన్న కవితాసంపుటి 1962లో వెలువడింది. తరువాత 1994లోగాని రెండవ కవితాసంపుటి "శక్తిధార" వెలువడలేదు. "ఏమున్నది వ్యర్థపు వాగ్వాదంలో?/ ఏమున్నది వ్యర్థపు వాక్పాతంలో?" అంటూ. అది కూడా మిత్రుల ప్రోద్బలంతోనే సాధ్యమైంది. ఈ సంపుటి వెలువడుతుందని తెలిసి గింజల సహపాఠి ఆచార్య చేకూరి రామారావు స్నేహవాత్సల్యంతో నల్లగొండకు విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు. అంతకుముందెన్నడూ ఎరుగని ఆ కవితాధార, ఆ శబ్ద చయనం, సమాస నిర్మాణ కౌశలంలో శ్రీనాథుడే అనిపించేంతటి ఆ సమ్యకు మంత్రముగ్ధులయ్యారంతా.

మధుమాసాన్ని "ద్యుతి మాసం"గా సంభావించి "చర్విత చర్వణగతిపై/ ధ్వజమెత్తుట మధుమాసం/ మధుమాసం ఇదో నవత/ మోసులెత్తు అవకాశం" అంటాడాయె; "మాట చేత ఒకటే దు/ ర్మార్గుల నెదిరించేయెడ మాట చేత ఒకటే మా/ టాడుట వీరత అగునెడ" మాటామంటా ఒకటేనని నిర్ధారిస్తాడాయె; "కాంతి తనువుగా/ మనశ్శాంతి జగద్వ్యథా దూరీకరణయత్నంగా/ కదలాలనిపిస్తుంది, శబ్ద/ కమ్రతతో స్తబ్ధతను వదలాలనిపిస్తుంది అంటూ "అంతశ్చేతన"ను బయల్పరుస్తాడాయె;"శైశవం కవితారూపం ధరించి సాక్షాత్కరిస్తుంది పాశవికతా లక్షణప్రతిబంధకంగా నిలుస్తుంది" అని అపురూపంగా వ్యాఖ్యానిస్తాడాయె!.

ఇంతటి కవిలో ఏకకాలంలో ఒక శ్రీశ్రీ, ఒక విశ్వనాథ, ఒక కృష్ణశాస్త్రి, ఒక మయకోవిస్కీ, ఒక టాగోర్, ఒక ఎమర్సన్, ఒక నెరుడా కనిపించటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు పాఠకులు, శ్రోతలు. "శక్తిధార" ద్వారా గింజల విశ్వరూపం పొడకట్టింది లోకానికి. అతడు కోరిన నవజగం, ప్రతిపాదంలో, పదంలో ఆవిష్కృతమైంది. అతడి భావతీవ్రతకదొక "నికష" అయి నిలిచింది.
 
ఇక, మూడవ కవితాసంపుటి "శబ్దధనువు" 1997లో వెలువడింది. భాష మీద, శిల్పం మీద గింజలకు గల సాధికారిక ప్రజ్ఞ మరొకమారు మరింత బలీయంగా వెల్లడైంది. పద్యం, గేయం, వచనం, ఏది రాసినా అందులో మాధుర్యాన్నీ, లయనూ, అట్లాగే ఒక శక్తినీ కూరడం ఈతని ప్రత్యేకత. తాదాత్మ్యం చెందని వ్యక్తీకరణను సుతరామూ ఒల్లడు. ఆపాదమస్తకం క్రియాత్మకత వుంటేనే ఇష్టపడతాడు రచనలను. ఆతడి మాటల్లోనే చెప్పాలంటే, "కవి తన కవితకు తానే ప్రథమ పాఠకుడు, ప్రథమ శ్రోత. కాబట్టి తనకు తృప్తి కలిగించని కవితలు వృథా".


ప్రగతి కాముకమైన భావాలతోనే కొసదాకా నిలవటం, పేదలు, శ్రామికుల పక్షపాతం వహించటం, దౌష్ట్యాన్ని, నియంతృత్వాన్ని ఎదిరించటం; సమతకై నిరంతరం సాహిత్య సమరం చేయటం– అన్నవి నరసింహారెడ్డి ఆనవాళ్లు. ఏది రాసినా అన్నింటా, నిస్వార్థ సేవ, అంకిత భావం, మానవీయ విలువలు, త్యాగాలకే ఈతడు చోటిస్తూ వచ్చాడు. భేషజాలనూ, కుహనా పోకడలనూ, శుష్క అనుకరణలనూ బాహాటంగా వ్యతిరేకించాడు. "ఆకలితో బాధపడేవాళ్లను ఆదుకొనక వేదాంతం దేనికి?/ చీకటిలో బాధపడేవాళ్లకు చూపక దారి– ప్రసంగాలు దేనికి?" అని గట్టిగా నిలదీశాడు. ఈతని ప్రకారం కవి ఆవశ్యకాలు, జగతి ఆవశ్యకాలు వేరుకావు. కనుకనే "సుకవి నిజంగా తనకు ఆవశ్యకాలనే వ్రాస్తాడు/ జగతి ఆవశ్యకాలు అతనికావశ్యకాలు ఒక రకమే చాలా వరకు" అని అన్నాడు.

కవితకూ శాస్త్రానికీ అభేదం పాటిస్తూ "కవితకు శాస్త్రానికి ఉన్న  భేదమెంత?/ నీటికి నీటి ఆవిరికి అనిపించేటంత" అని తేల్చిపారేశాడు. మట్టి అన్నా మట్టిని నమ్ముకున్న రైతులన్నా ఈతనికి అలవిమాలిన ప్రేమ. "మట్టితల్లి పైకెత్తిన చేయి/ తెరిస్తే బిడ్డలకు మణులు" అంటూ పొంగిపోయాడు. చివరగా "శక్తి జ్ఞానమె, దీప్తి జ్ఞానమె/ సౌఖ్య సకల ప్రాప్తి జ్ఞానమె" అని ప్రగాఢంగా నమ్ముతూ, "జిజ్ఞాసచే బ్రతుకు/ జ్ఞానం జిజ్ఞాస పరిణామపు తళుకు" అంటున్న గింజల కవితలతో మనమూ మెరుద్దాం; చైతన్యమై కురుద్దాం. (1937 డిసెంబరు 28న జన్మించిన గింజల నరసింహారెడ్డికిది 80వ సంవత్సరం)
- వేణు సంకోజు
9948419881

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement