ఏసీబీ అధికారులమని బెదిరించి.. ఐఫోన్ డిమాండ్
► రూ. 4 లక్షలు వసూలు, డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఘాతుకం
అమీర్‌పేట: ఔషధ నియంత్రణ మండలిలో పనిచేసే ఓ ఇన్స్పెక్టర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏసీబీ అధికారులమని చెప్పి మరో ఇన్స్పెక్టర్ను బెదిరించి డబ్బులు దండుకున్నారు. అంతటితో ఆగకుండా ఐఫోన్ కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన అనిల్‌ప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్నాడు. అదే విభాగంలో జీడిమెట్ల జోన్లో పని చేస్తున్న అరవింద్కుమార్రెడ్డిని అనిల్‌ప్రసాద్ తన స్నేహితులు వెంకట్రావు, లింగారావులతో కలిసి ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. వెంకట్రావు అరవింద్‌కుమార్‌కు ఫోన్‌చేసి తాను ఏసీబీ డీఎస్పీ నని నీపై అవినీతి ఆరోపనలు వచ్చాయని, త్వరలో విచారణ చేయాల్సి ఉంటుందని బెదిరించాడు. రూ.4లక్షలు ఇస్తే అంతా చక్కదిద్దుతానని చెప్పాడు.
నాలుగు రోజులక్రితం వారు అడిగినంత డబ్బు తెచ్చి ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న అనిల్ప్రసాద్కు ఇచ్చాడు. అయితే వెంకటరావు మరుసటి రోజు ఫోన్ చేసి ఐఫోన్ కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన అరవింద్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అనిల్‌ప్రసాద్, లింగారావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి రూ.1,95 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న సత్తెనపల్లికి చెందిన వెంకట్రావు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.