vijayadurga peetam
-
వైకుంఠ ద్వార దర్శనం.. ముక్తికి మార్గం
వెదురుపాక(రాయవరం) : వైకుంఠ ద్వార దర్శనం ముక్తి కి మార్గమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తులనుద్దేశించి గాడ్ మాట్లాడుతూ శ్రీవైష్ణవ క్షేత్రాల్లో దేవతల కాల ప్రమాణాలను బట్టి ఏడాదిలో రెండు భాగాలైన దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయనం పగలుగా ఉంటాయన్నారు. ఈ మకర సంక్రమణ ఉత్తరాయన ప్రవేశానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారన్నారు. ముక్కోటి ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజున లభించేలా చేసేదే ముక్కోటి ఏకాదశిగా అన్నారు. ఈ పర్వదినాన వైష్ణవాలయాల్లో శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి వారికి పీఠబ్రహ్మ కోట వీరవెంకటసత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. -
1 నుంచి విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రులు
నిత్యం అమ్మవారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు వెదురుపాక(రాయవరం) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో వచ్చే నెల ఒకటి నుంచి 11 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) శనివారం పీఠాధిపతి వి.వి.సుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో వివరాలను విలేకరులకు తెలిపారు. ఒకటిన ఆశ్వయుజ శుద్ధపాడ్యమి ఉదయం 9.18 గంటలకు హస్తా నక్షత్రం సూర్యహోరలో కలశస్థాపన జరుగుతుంది. విజయదుర్గా అమ్మవారికి రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఒకటిన రజత కవచధారిణి, 2న శ్రీబాలాత్రిపుర సుందరి, 3న అన్నపూర్ణాదేవి, 4, 5 తేదీల్లో గాయత్రీదేవి, 6న లలితా త్రిపురసుందరీదేవి, 7న సరస్వతీదేవి, 8న మహాలక్ష్మీదేవి, 9న దుర్గాదేవి, 10న మహిషాసుర మర్దిని, 11న విజయదశమి రోజు రాజరాజేశ్వరీదేవి అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కాగా గాడ్ సమక్షంలో ఆహ్వానపత్రికను ఆవిష్కరించిన బాపిరాజు, బాబి పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పీఠం భక్తజన కమిటీ సభ్యుడు గాదె భాస్కరనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధర్మ పరిరక్షణ కు నడుం కట్టాలి
భక్తులకు వెదురుపాక గాడ్ పిలుపు పీఠంలో ఘనంగా నవావరణ హోమం ముగిసిన 44వ వార్షికోత్సవాలు వెదురుపాక (రాయవరం): ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించాలని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) భక్తులకు పిలుపునిచ్చారు. పీఠం 44వ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న ఆర్యోక్తి అనాదిగా వాస్తవ రూపం దాలుస్తోందన్నారు. వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ కోట సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో నవావరణ హోమాన్ని నిర్వహించారు. సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన 108వ హోమాన్ని పీఠంలో నిర్వహించడం సంతోషకరమని అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు పేర్కొన్నారు. భక్తజన సంక్షోభ నివారణార్థం, వారి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ శ్రీ విజయదుర్గా అమ్మవారి నవావరణ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వైభవంగా శ్రీవారి కళ్యాణం.. తిరుమల తిరుపతి దేవస్థానం పీఠానికి అందజేసిన శ్రీదేవి, భూదేవి సమేత విజయవెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజనసేవ నిర్వహించారు. పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలను గాడ్ సమక్షంలో శ్రీనివాసమంగాపురం దేవాలయ ప్రధాన అర్చకుడు బాలాజీ ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు. రాత్రి 8 గంటల సమయంలో తిరుమల వైఖానస పండితులతో శ్రీవారి దివ్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. పూజల్లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. -
నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర శాంతి కల్యాణం
ఘనంగా ప్రారంభమైన పీఠం 44వ వార్షికోత్సవాలు వెదురుపాక(రాయవరం): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆగస్టు 16 నుంచి 18 వరకు వీటిని నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. దీనిలో భాగంగా తొలిరోజు మంగళవారం పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సతీమణి సీతమ్మ జ్యోతిప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం.. విజయదుర్గా పీఠంలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి శాంతి కల్యాణం నేత్వపర్వంగా సాగింది. సాయంత్రం ఆరు గంటలకు తమిళనాడు తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన సంపత్గురుకుల్, గోపిగురుకుల్ అర్చకత్వంలో స్వామివారు, దేవేర్లకు శాస్త్రోక్తంగా కల్యాణం, పలు పూజలు నిర్వహించారు. ఉదయం త్రిశతిపూజ, హోమం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో విశాఖపట్నం టౌన్‌ప్లానింగ్ అధికారి సంజీవ్‌కుమార్, వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆకట్టుకున్న అమ్మవారి విగ్రహం.. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో విశాఖపట్నం నుంచి 14 అడుగుల దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకుని వచ్చి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని గాడ్ ఆవిష్కరించి పూజాధికాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన 14 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
నేటి నుంచి విజయదుర్గాపీఠం వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) సోమవారం తెలిపారు. 1972 ఆగస్టు 18వ తేదీన పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ స్వామి శ్రీ విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. అమ్మవారికి పీఠంలో నిరంతరాయంగా పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాలు సర్వతో భద్రతా మండప ఆవాహనతో మంగళవారం ఉదయం 8.05 గంటలకు పూజలు ప్రారంభమవుతాయని బాబీ చెప్పారు. అనంతరం తమిళనాడు తిరుత్తణిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆస్థాన పండితులచేత కాలసర్ప, కుజగ్రహ దోష నివారణార్థం శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహించనున్నట్లు వివరించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతికల్యాణం జరుగుతుందన్నారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పండితులచేత దివ్య కల్యాణం జరుగుతుందని చెప్పారు. 18వ తేదీ ఉదయం 9.16 గంటలకు శ్రీ విజయదుర్గా అమ్మవారి నవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు తిరుమల శ్రీ వైఖానస ఆగమ పండితులచే శ్రీ భూ సహిత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు బాబీ తెలిపారు.