30న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 30న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం 4.15 నిమిషాలకు అలిపిరి-చెర్లోపల్లి నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.15 నిమిషాలకు నందకం అతిథి గృహం వద్ద వకుళా మాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం యాత్రికుల ఉచిత సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాత్రి 7.05 నిమిషాలకు బేడి ఆంజనేయస్వామి వద్ద నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో ప్రారంభమయి.. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి.
గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం...
తిరుమల శ్రీవారి బ్రహ్మోతవ్సాల్లో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరుతూ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. శనివారం సాయంత్రం విజయవాడలో గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీలో చేపట్టిన సంస్కరణల గురించి గవర్నర్‌కు వైవీ తెలియజేశారు. శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు సులువుగా దర్శనం జరిగేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న విధి విధానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. గవర్నర్ ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.