అంబరాన్నంటిన సంబరాలు
వైజాగ్ ఫెస్ట్‌కు అపూర్వ ఆదరణ.. వారాంతం కావడంతో శనివారం స్టాళ్లన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జనం పోటెత్తారు. పిల్లలు, పెద్దలు, యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫెస్ట్ ఆవరణంలో అడుగు పెట్టగానే అన్ని హంగులు, కావాల్సిన కార్యక్రమాలు, ఆహ్లాదపరిచే సాహితీ వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు అందరినీ అలరిస్తున్నాయి. ఫెస్ట్ ముగింపుకు రావడంతో రద్దీ మరింత పెరిగింది.
విశాఖ-కల్చరల్ : ఆలోచింపజేసే గీతాలు... హృదయాలను హత్తుకునే నృత్యాలు... జనాన్ని కదిలించే జనపదాలు అలరించాయి. గోరటి వెంకన్న గొంతెత్తి పాట పాడితే ప్రేక్షక లోకం ఒక్కసారిగా స్తంభించింది. కళాభిమానులు చెవులు రిక్కించి ఆయన పాటలను ఆలకించారు. వైజాగ్ ఫెస్ట్-సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఘంటసాల కళావేదిక శనివారం రాత్రి ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు అందించింది. జానపదం నుంచి కొత్తరూపం దాల్చిన ‘జనం కోసం రూపకం’ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.
ఖమ్మం జిల్లా కూనవరం రాజయ్య బృందం ప్రదర్శించిన డోలుకొయ్యలు అలరించాయి. ‘గల్లీ చిన్నది.. గరీబోడికన్నా పెద్దదీ..’ అంటూ గోరటి వెంకన్న పాడిన పాట కదిలించింది. ఉత్తరాంధ్రపై ‘నాగవళీ, వంశధార, శారదా, తాండవ నదులు పొంగేటి గంగాయమ్మ తల్లీ...’ అంటూ సాగిన గీతం హర్షధ్వానాలు అందుకుంది. ఘంటశాల స్పోర్ట్సు అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్నా తిరుమలరావు బృందం, అరుణోదయ, సుస్వరమాధురి, ప్రియరాగ వంటి ఆర్కెస్ట్రాలు ఆలపించిన సుమధుర సంగీత విభావరి సంగీత ప్రియులను మరోలోకంలో విహరింపచేసింది. అరుణోదయ నిర్మల్ బృందం ఆలపించిన జానపద గీతాలు ఉర్రూతలూగించాయి.
పౌరాణిక కళాకారుడికి ఘన సత్కారం
ప్రముఖ పౌరాణిక కళాకారుడు, నంది అవార్డు గ్రహీత డి.అచ్చియ్యనాయుడును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్రకమిటీ సభ్యురాలు ఎస్.పుణ్యవతి, దడాల సుబ్బారావు, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సాహిత్య, సంగీత, కళారంగానికి ఉత్తరాంధ్ర పుట్టినిల్లని కొనియాడారు. తాను గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం తొలి ప్రదర్శనలో పాల్గొన్నట్టు చెప్పారు. తొలుత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.