5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!
యూత్‌లో చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవడం అనేది వరుసగా ఏడు యుద్ధాలు చేసి గెలవాల్సినంత పెద్ద సవాలు! అయినప్పటికీ కొందరు వార్‌కు సై అంటూ రంగంలోకి దిగుతున్నారు. పాత అలవాటుకు చరమగీతం పాడి.. ఉదయగీతం పాడుతున్నారు...
చెన్నైకి చెందిన అఖిల ఇంజనీరింగ్ స్టూడెంట్. తాను నిద్రలేచే టైమ్ ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది. అలాంటి అఖిల తన కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గత రెండు సంవత్సరాలుగా అఖిల ఉదయం అయిదుగంటలకే ఠంచనుగా నిద్రలేస్తోంది. ఆమె కుటుంబసభ్యులు ఎంత సంతోషిస్తున్నారో!
ధీరజ్‌కు ఏమైంది?
ఇప్పుడు చెన్నై నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు వెళదాం. టీనేజ్ కుర్రాడు ధీరజ్ నిద్రపోయే సమయం తెల్లవారుజాముకు దగ్గరలో ఉంటుంది. ఉదయం పదకొండు గంటల తరువాత నిద్ర లేస్తుంటాడు. అలాంటి ధీరజ్ మారిపోయాడు. పొద్దున అయిదు గంటలకు ముందే నిద్ర లేచి కసరత్తులు చేస్తున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన భవ్యశ్రీ రాత్రి ఒంటిగంట దాకా ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు రకరకాల సామాజికమాధ్యమాలలో గడుపుతుంటుంది. అలాంటి భవ్యశ్రీ ఈమధ్య కాలంలో అయిదుకు ముందే నిద్రలేస్తోంది. పేరేంట్స్ చేత ‘శభాష్’ అనిపించుకుంటోంది.
ఒక వ్యక్తి అలవాట్లులో మార్పు రావడానికి అనూహ్యమైన సంఘటనలేవీ జరగనక్కర్లేదు. కొన్ని వాక్యాలు చాలు. కొన్ని దృశ్యాలు చాలు.
ఆరోజు ఏం జరిగిందంటే...
పుస్తకాలు చదివే అలవాటు ఉన్న అఖిల కాలేజి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రాబిన్ శర్మ ‘5 ఏఎం క్లబ్’ పుస్తకం చదివింది. పొద్దున అయిదుగంటలకే నిద్ర లేచే ప్రపంచ ప్రసిద్ధ ఎంటర్ప్రెన్యూర్ల గురించి చెప్పే పుస్తకం ఇది. ‘ఉన్నట్టుండి ఒక అలవాటును మార్చుకోవడం అనేది మీకే కాదు. ఎవరికైనా కష్టమే. ఫెయిలయితే కావచ్చు.
అయితేనేం, ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు కదా అనుకొని రంగంలోకి దిగండి’ అనే ఈ పుస్తకంలోని వాక్యాలు ఆమెను ఆకట్టుకున్నాయి. ‘నేను కూడా ఒక ప్రయత్నం చేస్తాను’ అనుకొని ‘5ఏఎం క్లబ్’ చెప్పిన మెథడ్స్‌ను ఫాలో అయింది.
రెండు వారాలు కఠినంగా గడిచాయి. కానీ తన ప్రయత్నంలో విఫలం కాలేదు. ఇక ఇప్పుడు అలారమ్ అవసరం లేకుండానే తనకు తానుగా నిద్ర లేస్తోంది. ‘అసలు టైమే సరిపోవడం లేదు’ అనే మాట అఖిల గొంతు నుంచి తరచుగా వినబడేది. ఇప్పుడు మాత్రం తనకు బోలెడు టైమ్ దొరుకుతుంది.
ధీరజ్‌కు సినిమాలు, హీరోల ఇంటర్వ్యూలు చూడడం అంటే ఇష్టం. ఒకరోజు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూను టీవీలో చూశాడు. అది తనపై బాగా ప్రభావం చూపించింది. ఫిఫ్టీ ప్లస్‌లోనూ అక్షయ్ సూపర్ ఫిట్నెస్తో ఉండడానికి కారణం పర్ఫెక్ట్ స్లీప్సైకిల్ను ఫాలో కావడం. రాత్రి తొమ్మిది గంటలకే నిద్ర పోయే అక్షయ్ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాడు. ఆ తరువాత రకరకాల కసరత్తులు మొదలుపెడతాడు.
హెల్తీ ఫిట్నెస్
ఆ ఇంటర్వ్యూ చూసినప్పటి నుంచి ‘హెల్తీ ఫిట్నెస్’ అనే మాట ధీరజ్ బుర్రలో తిరుగుతూనే ఉంది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాడు. రాత్రి పదిగంటలకే పడుకునేలా ప్రయత్నం మొదలుపెట్టాడు. అది ఎంత కష్టమో తెలిసొచ్చింది. అయినప్పటికీ తన ప్రయత్నానికి విరామం ఇవ్వలేదు.
కొన్ని వారాల తరువాత సఫలం అయ్యాడు. ఉదయం అయిదు గంటలకే నిద్ర లేవడం మొదలుపెట్టాడు. రోజూ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతున్నాడు. ఎందరి నోటి నుంచో విన్న ‘ఆరోగ్యకరమైన జీవనశైలి’ అనే మాట ఇప్పుడు తన అనుభవంలోకి వస్తోంది. సంతోషమే కదా!
భవ్యశ్రీలాంటి టెక్ ప్రేమికులు స్మార్ట్ఫోన్ల ద్వారా తమ ‘స్లీప్ క్వాలిటీ’ను తెలుసుకోడానికి ఆసక్తి చూపడమే కాదు, తమ పాత అలవాటును మార్చుకొని ఉదయాన్నే లేస్తున్నారు. ‘హెల్త్ యాప్’ ‘వేకప్’ ‘అలారం’... మొదలైన యాప్‌ల ద్వారా ‘బెడ్ టైమ్’ ‘వేకప్ టైమ్’ను పక్కాగా సెట్ చేసుకుంటున్నారు.
చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం?
Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..