విజిల్ ఊదుతారు.. నిద్ర లేపుతారు!
గరియాబాద్: నెలనెలా ఠంచనుగా జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి బద్దకిస్తుంటారు సర్కారు పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది బడిపంతుళ్లు. ఛత్తీస్గఢ్‌లోని గరియాబాద్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు మినహాయింపు.
విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా వారిని చదివించడానికి ప్రత్యేకంగా ప్రయత్నం కూడా చేస్తున్నారు. విద్యార్థులు నేరుకున్న వాటిని వల్లెవేయించడానికి ఇంటికి తిరుగుతున్నారు. తెల్లవారుజామున విద్యార్థులను నిద్రలేపి పాఠాలు చదివేలా చేస్తున్నారు. టీచర్ల ఉపాయం అద్భుత ఫలితాలు ఇచ్చింది. పరీక్షల్లో గరియాబాద్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాలా మెరుగుపడింది. ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సమీప గ్రామాలకు వెళ్లి విజిల్ ఊది విద్యార్థులను మేల్కోలిపి చదివిస్తున్నారు.
'నేను, నాతోటి ఉపాధ్యాయులు తెల్లవారుజామున 4 గంటలకు లేచి సమీప గ్రామాలకు వెళతాం. విద్యార్థులను నిద్రలేపి పాఠాలు చదవాలని వారిని ప్రోత్సహిస్తామ'ని ప్రధానోపాధ్యాయుడు జీవీ వర్మ తెలిపారు. 'ప్రతిరోజు తెల్లవారుజామునే టీచర్లు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని నిద్రలేపుతారు. తర్వాత పిల్లలంతా కలిసి చదువుకుంటామ'ని మణిప్రభ అనే విద్యార్థిని వెల్లడించింది. ఇదంతా చూస్తుంటే... 'ఉపాధ్యాయుల వ్యక్తిగత ప్రయత్నాలు మానవ ప్రపంచ గమ్యాన్నే ప్రభావితం చేస్తాయ'ని ఆస్ట్రేలియన్ రచయిత్రి హెలెన్ క్లాడికోట్ మాటలు అక్షర సత్యాలని రుజువవుతోంది.