wanaparti
-
ఊడిన బస్సు టైరు : తప్పిన ప్రమాదం
జడ్చర్ల టౌన్: ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు టైరు ఊడిపోయింది. ఈ సంఘటన జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. టైరు ఊడిన సమయంలో రోడ్డుపై జనసంచారం, వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ముందు టైర్ ఊడిపోయింది. టైర్ ఊడిపోవడంతో బస్సు రోడ్డుపైనే ముందుకు వెళ్లలేకుండా కూలబడింది. బస్సు వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఈ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. వాహనాలు సైతం రాకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు కుదుపునకు గురైనప్పటికీ ఎలాంటి రక్తగాయాలు కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్‌కు పంపించారు. రాత్రికి మెకానిక్‌లను పిలిచి మరమ్మతు చేయించుకుని బస్సును తిరిగి వనపర్తికి తీసుకెళ్లారు. -
వనపర్తి లో చిరుతల సంచారం
పానగల్: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లారెళ్లపల్లి గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కొందరు గ్రామస్థులు చిరుతలు సంచరించడాన్ని గుర్తించారు. శివారులోని పొలాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చిరుతల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాముకాటుకు ఇద్దరు చిన్నారుల మృతి
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన రాములు కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా అర్థరాత్రి రాములు కుమార్తె సవరమ్మ(ఏడాదిన్నర), బంధువుల కుమారుడైన మాసయ్య(10)ను పాముకాటుకు గురయ్యారు. నురగలు కక్కుతున్న చిన్నారులను గమనించిన రాములు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు.