పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
విశాఖ: తమిళనాడు తీరానికి చేరువలో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తాలో చాలచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల ఒ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ అల్పపీడన ప్రభావంతో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీచే అవకాశముంది. ముందు జాగ్రత్త చర్యగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.