పోర్టు సిటీల మధ్య చుక్ చుక్
- నేడు పారాదీప్ రైలు ప్రారంభం
విశాఖపట్నం : పోర్టు కార్యకలాపాల కేంద్రాలైన విశాఖ-పారాదీప్‌ల మధ్య ఓ వీక్లీ రైలు ఎట్టకేలకు నడవనుంది. ఈ రెండు పట్టణాల మధ్య రైలు నడుపుతున్నట్లు గత బడ్జెట్లో రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి రిమోట్ ద్వారా రైలును ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి దాదాపు 554 కిలోమీటర్ల దూరంలోని పారాదీప్‌కు వెళ్లాలంటే గతంలో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. శ్రీకాకుళం దరి పలాస నుంచి డీఎంయూ రైలు ద్వారా కొందరు పారాదీప్‌కు వెళుతుంటే ఎక్కువ శాతం మంది భువనేశ్వర్, కటక్ మీదుగా ప్రయాణించి పారాదీప్‌కు చేరుకునే వారు. విశాఖ పోర్టు, పారాదీప్ పోర్టులు రెండూ మేజర్ పోర్టులే కావడంతో ఈ రెండు నగరాల మధ్య అనేక ఏళ్లుగా షిప్పింగ్ కంపెనీలు, మత్స్యకారుల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు జరిగేవి. ఇప్పుడీ రైలు రాకతో మరింత వేగంగా ఇరు ప్రాంతాల సంబంధాలు పెరుగుతాయని వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు.
పారాదీప్ వేళలు
విశాఖపట్నం-పారాదీప్-విశాఖపట్నం(22810/09) వారాంతపు ఎక్స్‌ప్రెస్ ప్రతీ వారం విశాఖ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖ(22810) నుంచి బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పారాదీప్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పారదీప్(22809) నుంచి ప్రతీ బుధవారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8.30 గంటలకు విశాఖకు చేరుతుంది.