ఇరిగేషన్ మాయాజాలం
నీటిపారుదలశాఖ పనితీరు పలు విమర్శలకు తావిస్తోంది. నీటితీరువా వసూళ్లకు సంబంధించి వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయకట్టును ఎప్పటికప్పుడు సవరించకపోవడం అటు రైతులకు, ఇటు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. తాండవ జలాశయం నిర్మించిన తరువాత ధ్రువీకరించిన ఆయకట్టును మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సవరించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - నాతవరం
- పొంతనలేని నీటిపారుదలశాఖ, రెవెన్యూ లెక్కలు
- గందరగోళంగా నీటితీరువా వసూలు
- అయోమయంలో రెవెన్యూ సిబ్బంది
నాతవరం మండలంలో నీటితీరువా వసూలు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించిన విస్తీర్ణానికి, రెవెన్యూ అధికారుల వద్ద ఆయకట్టు వివరాలకు పొంతన లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తాండవ జలాశయం ప్రారంభంలో నీరు విడుదల చేసినప్పుడు ఆయకట్టు విస్తీర్ణం 19 వేలుగా నిర్ణయించారు. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాతవరం మండలంలో పి.జగ్గంపేట నుంచి చెర్లోపాలెం వరకు 12 పంచాయతీల మీదుగా సుమారు 12 కిలోమీటర్ల పొడవునా ఏలేరు కాలువను ఏర్పాటుచేశారు.
జిల్లేడుపూడి పంచాయతీలో ఏలేరు కాలువ డీప్‌కట్‌లో తాండవ ఆయకట్టుకు చెందిన సుమారు 100 ఎకరాలు కలిసిపోయాయి. తాండవ ఆయకట్టు భూముల్లోంచి ఏలేరు కాలువను నిర్మించడం వల్ల రైతులు నష్టపోయారు. గిట్టుబాటు కాక వరిసాగుపై విరక్తి చెందిన చాలామంది రైతులు జీడిమామిడి, జామి, ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. దీంతో ఇరిగేషన్ ఆయకట్టులో వేలాది ఎకరాలు తగ్గిపోయాయి. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయకట్టును సవరించని ఇరిగేషన్ అధికారులు 19 వేల ఎకరాలకు నీటితీరువా వసూలు కావాల్సి ఉందని కలెక్టర్‌కు నివేదించారు. రెవెన్యూ అధికారులు మాత్రం రైతులు సాగుచేస్తున్న పంటలు ఆధారంగా 13 వేల ఎకరాలకు సుమారు రూ.40 లక్షలు నీటితీరువా వసూలు చేయాల్సి ఉందన్నారు. తాండవ (ఇరిగేషన్) అధికారులు మాత్రం గతంలో గుర్తించిన 19 వేల ఎకరాలకు రూ.40 లక్షలు నీటితీరువా వసూలుచేయాలని రెవెన్యూ అధికారులకు సూచిస్తున్నారు. వీరి నివేదిక ఆధారంగా నీటితీరువా వసూలుకు కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిమధ్య వీఆర్వోలు నలిగిపోతున్నారు.
చాలా ఇబ్బంది పడుతున్నాం
ఇరిగేషన్ అధికారుల రికార్డుల ఆధారంగా నీరు తీరువా పన్ను చెల్లించమంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. తాండవ నీరు ఉపయోగించనందున నీటి పన్ను చెల్లించమని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే మెట్ట రైతులు తాండవ నీటిని ఉపయోగించడం లేదు. - శేషుకుమార్, వీఆర్వో, నాతవరం 1
మా లెక్కలు వాస్తవమే
తాండవ నీరు ఎంత అయకట్టుకు సరఫరా చేస్తున్నామో అంత విస్తీర్ణం మాత్రమే రికార్డులలో నమోదు చేశాం. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితి నమోదు చేస్తే 19వేలు కన్నా అదనంగా ఆయకట్టును చేర్చాల్సి ఉంటుంది.
- శ్రీనివాస్‌కుమార్, డీఈ, తాండవ ప్రాజెక్టు
వాస్తవ ఆయకట్టును గుర్తిస్తాం
తమ రికార్డుల్లో సమాచారానికి ఇరిగేషన్ వివరాలకు పొంతనలేదు. దీనిపై త్వరలో సర్వే చేసి వాస్తవ ఆయకట్టును గుర్తిస్తాం. - కనకారావు, తహశీల్దార్, నాతవరం