మోసగించిన వ్యక్తి ఇంటి ఎదుట యువతి ఆందోళన
బాధితురాలిపై స్థానికుల దాడి
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
తాండూర్ : మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన గోగర్ల సత్యనారాయణ ఇంటి ఎదుట ఖమ్మం జిల్లా రేగులతండాకు చెందిన బదావత్ శారద అనే యువతి న్యాయంపోరాటానికి దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం తన అక్క, బావలతో పాటు రెబ్బెన సమీపంలోని సిరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్న గోగర్ల సత్యనారాయణతో శారదకు పరిచయం ఏర్పడింది. తనకు వివాహం జరగలేదని సత్యనారాయణ నమ్మబలికి శారదను ఇటీవల హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై కొద్ది రోజులు కలిసుండి తర్వాత సత్యనారాయణ కనిపించకుండాపోయాడు. దీంతో శారద సోమవారం తాండూర్‌కు వచ్చి సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది.
యువతి ఆందోళన చేస్తుండగా సత్యనారాయణ భార్య, స్థానిక మహిళలు ఆమెపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శారద తాండూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వచ్చి సత్యనారాయణను విచారించారు. తనకు శారదతో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను అభాసుపాలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.