అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర ఆగబోదు
కాకినాడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కాపుల సత్యాగ్రహ యాత్రకు ఆంక్షలు విధించడం ఎంత మాత్రం సరైంది కాదని, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు నిరసించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం శశికాంత్నగర్లోని శుభమ్ కాపు కళ్యాణమండపంలో జరిగిన జిల్లా కాపుసద్భావన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల హామీ అమలు కోసం ఈనెల 25న రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్ర కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం సారథ్యంలో జరుగుతుందన్నారు. పోలీసులు బందోబస్తుతో ముద్రగడ పాదయాత్ర శాంతియుతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చినా పలు ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కోసం కోరుతుంటే ఉపముఖ్యమంత్రితో సహా మంత్రులందరితో తమ నాయకుడిపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్క మంత్రికీ లేదని, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజం రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు కోడిపందాలు, పేకాట, గుండాట వంటి వాటిని దర్జాగా ఆడుకునేలా చేశారని, అటువంటి వాటికే పర్మిషన్ లేనప్పుడు శాంతియుతంగా పాదయాత్ర చేసుకునేందుకు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. ఏదేమైనా ఈనె 25న ముద్రగడ సారథ్యంలో సత్యాగ్రహపాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో కాపు ప్రతినిధులు బస్వా ప్రభాకరరావు, యాళ్ల శ్రీనివాసరావు, రంకిరెడ్డి దుర్గారావు, కర్రి చక్రధర్, కొప్పిశెట్టి శ్రీను, సిద్దు నూకరాజు పాల్గొన్నారు.