యువరక్తంతోనే భవిష్యత్ యుద్ధాల్లో విజయం
బీజింగ్: భవిష్యత్ యుద్ధాల్లో విజయం సాధించేందుకు సైన్యంలో యువ రక్తం అవసరం ఎంతో ఉందని, ఆ దిశగా నియామకాలను వేగవంతం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సైనిక పోటీలో విజయం సాధించేందుకు, సైన్యం మెరుగైన పనితీరుకు, భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించేందుకు సాయుధ దళాల్లో కొత్తరక్తం కీలకమన్నారు. సైన్యంలో ప్రతిభకు సంబంధించిన విధానాలపై శుక్రవారం నుంచి ఆదివారం వరకు బీజింగ్‌లో జరిగిన సదస్సులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్, సర్వసైన్యాధ్యక్షుడు అయిన జిన్‌పింగ్ ప్రసంగించారు.
పోరాడటానికి, విజయం సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడమే సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ–పీఎల్ఏ) లక్ష్యం కావాలన్నారు. ఆధునిక యుద్ధాల్లో గెలుపు సాధించిపెట్టే శాస్త్రీయమైన, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్నారు. ఉత్తమ శ్రేణి మిలటరీ స్కూళ్ల ఏర్పాటు చేసి, అత్యుత్తమమైన సైనికులను తయారు చేయాలని కోరారు. 2027లో జరిగే పీఎల్ఏ వందేళ్ల ఉత్సవాలకు పెట్టుకున్న లక్ష్యాల సాధనకు కొత్తరక్తాన్ని నింపాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.
యుద్ధ విధుల్లోకి మరో 3 లక్షల మందిని నియమించుకునేందుకు చైనా సైన్యం పీఎల్ఏ సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో జిన్‌పింగ్∙ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 209 బిలియన్ డాలర్ల వార్షిక రక్షణ బడ్జెట్ కలిగిన చైనా సైన్యం ఆధునీకరణ ప్రయత్నాలను వేగవంతం చేసింది. సంస్థాగతంగా సంస్కరణలు చేపట్టింది. హైపర్సోనిక్ ఆయుధాలు వంటి కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. చైనా ఇటీవల ప్రపంచాన్ని చుట్టి వచ్చే సత్తా కలిగిన దీర్ఘశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు అమెరికా సైన్యం అంటోంది. ఈ క్షిపణి విడిచిపెట్టిన హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ తిరిగి చైనాలోని లక్ష్యానికి అతి చేరువలోకి వచ్చినట్లు పేర్కొంది. 2012లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టాక పీఎల్ఏ ఆధునీకరణ దిశగా చర్యలను వేగవంతం చేశారు. అంతకుముందు 23 లక్షలుగా ఉన్న సైన్యాన్ని ప్రస్తుతం 20 లక్షలకు తగ్గించారని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.