'కాంగ్రెస్కు యువరక్తాన్ని ఎక్కిస్తాం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుల, కుటుంబ పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. మహిళ, మాల, మాదిగలకు కేసీఆర్ తన కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదంటూ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన కులంవారికి, కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర నామమాత్రమేనన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ సభలోనే లేరని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కేసీఆర్ నాశనం చేయాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్కు కొత్తరక్తాన్ని ఎక్కిస్తామని, పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రామోజీఫిల్మ్సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.