వర్షంతో మ్యాచ్ రద్దు
టైటాన్స్, కోల్‌కతాలకు చెరో పాయింట్
19 పాయింట్లతో టాప్ –2 ఖాయం చేసుకున్న నైట్‌రైడర్స్
అహ్మదాబాద్: సొంతగడ్డపైనే గుజరాత్ టైటాన్స్ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్ టైటాన్స్ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడింది.
కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్‌దీప్ సింగ్, నిఖిల్ పట్వర్దన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
పటిష్టస్థితిలో కోల్‌కతా
ఫలితం తేలని మ్యాచ్‌తో టాప్–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్ రద్దుతో వచి్చన ఒక పాయింట్‌తో కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ మిగిలున్న ఆఖరి మ్యాచ్‌లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ తమ రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్‌రైడర్స్ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్ ఆడే పరిస్థితి అయితే రాదు.
ఐపీఎల్‌లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్ చేరిన గుజరాత్ ఈసారి ఇంకో మ్యాచ్ మిగిలున్నా... లీగ్ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్ గెలిచిన టైటాన్స్ గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్‌కతా (19), రాజస్తాన్ (16), చెన్నై (14), హైదరాబాద్ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్ ఖేల్ లీగ్‌తోనే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment